Slow Walkers COVID-19 : షాకింగ్ ఫ్యాక్ట్.. నెమ్మదిగా నడిచేవారికి కరోనా ముప్పు, మరణాలు ఎక్కువే

తాజాగా మరో అధ్యయనంలో జనాలను కలవరానికి గురి చేసే విషయం బయటపడింది. మరీ ముఖ్యంగా నెమ్మదిగా నడిచే వ్యక్తులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

Slow Walkers COVID-19 : షాకింగ్ ఫ్యాక్ట్.. నెమ్మదిగా నడిచేవారికి కరోనా ముప్పు, మరణాలు ఎక్కువే

Maharashtra Corona

Slow Walkers at Higher Odds for Severe COVID-19 : చైనాలో తొలుత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి ఏడాదిన్నరగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

కాగా, కరోనా గురించి జరుగుతున్న అధ్యయనాల్లో కొత్త కొత్త షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాలు జనాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో అధ్యయనంలో జనాలను కలవరానికి గురి చేసే విషయం బయటపడింది. మరీ ముఖ్యంగా నెమ్మదిగా నడిచే వ్యక్తులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

మ్యాటర్ ఏంటంటే.. నెమ్మదిగా నడిచే వ్యక్తుల్లో కరోనా వైరస్‌ ముప్పు ఎక్కువేనని లండన్‌ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ బరువు కలిగి, వేగంగా నడిచే వారితో పోలిస్తే నెమ్మదిగా నడిచేవారిలో కొవిడ్‌ మరణాలు దాదాపు నాలుగు రెట్లు అధికమని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లైసెస్టర్‌ పరిశోధకులు గుర్తించారు.

అధిక బరువు కలిగి, నెమ్మదిగా నడిచే వ్యక్తుల్లో కొవిడ్‌ తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) స్థాయి అధికంగా ఉన్న దాదాపు 4 లక్షల 12వేల మంది మధ్యవయసు కలిగిన వారిపై అధ్యయనం చేపట్టారు. నెమ్మదిగా నడిచే వారిలో కొవిడ్‌ ముప్పు 2.5 రెట్లు ఎక్కువగా ఉందని, వేగంగా నడిచేవారితో పోలిస్తే ఇలాంటి వారిలో మరణాలు నాలుగు రెట్లు ఎక్కువని కనుగొన్నారు.

‘శారీరక బలహీనత, స్థూలకాయం వల్ల కొవిడ్‌ ముప్పు అధికంగా ఉంటుందని తెలుసు. దీన్ని నిరూపించే మొట్టమొదటి అధ్యయనం ఇది’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ యేట్స్‌ అన్నారు. అయితే, ఇలా జరగడానికి శరీర బరువుకి సంబంధం లేదని స్పష్టంచేశారు. అధిక బరువుండి వేగంగా నడిచే వారిలో ఈ ముప్పు తక్కువేనని, బరువుతో సంబంధం లేకుండా నెమ్మదిగా నడిచే వారిలోనే ఈ ప్రమాదం ఎక్కువని వెల్లడించారు.

సాధారణంగా వేగంగా నడిచే వారిలో గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని తేలింది. ఇలాంటి వారిలో వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి ఒత్తిడి తక్కువగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఇది పూర్తిగా నిరూపితం కాలేదని ప్రొఫెసర్‌ యేట్స్‌ అభిప్రాయపడ్డారు. అందుకే బీఎంఐతో పాటే నడక స్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని స్పష్టంచేశారు. ఆరోగ్యంతో పాటు శరీరక ధృడత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇలాంటి ముప్పుల నుంచి బయటపడవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోందని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది. కరోనా.. సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని యూఎన్ నిపుణుల బృందం వెల్లడించింది. శీతకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంది.