Panjshir : పంజ్‌షిర్‌పై పాక్‌ బాంబుల దాడి..మసూద్‌ సన్నిహితుడు ఫహీమ్‌ దష్తీ మృతి

పంజ్‌షిర్‌పై నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ పట్టు సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పంజ్‌షిర్‌పై పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డ్రోన్లతో స్మార్ట్ బాంబులను కురిపించింది.

Panjshir : పంజ్‌షిర్‌పై పాక్‌ బాంబుల దాడి..మసూద్‌ సన్నిహితుడు ఫహీమ్‌ దష్తీ మృతి

Pak Attack

Pakistan Smart bomb attack : పంజ్‌షిర్‌పై నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ పట్టు సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పంజ్‌షిర్‌పై పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డ్రోన్లతో స్మార్ట్ బాంబులను కురిపించింది. తాలిబన్లకు అండగా పాక్‌ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. పంజ్‌షిర్‌ను ఆక్రమించేందుకు తాలిబన్లు పోరాడుతున్నారు. ఇందుకు పాక్‌తో పాటు అల్‌ ఖైదా గ్రూపు కూడా తాలిబన్లకు మద్దతు ప్రకటించింది. వారు కూడా పంజ్‌షిర్‌ యోధులను మట్టుబెట్టేందుకు పోరాడుతున్నారు.

పంజ్‌షిర్‌ దళ నాయకుడు అహ్మద్ మసూద్‌ అనుచరుడు, అధికార ప్రతినిధి ఫహీమ్‌ దష్తీని చంపేశారు. తాలిబన్లతో పోరాడుతున్న క్రమంలో ఆయన మరణించారని చెబుతున్నారు. ఈ విషయాన్ని పంజ్‌షిర్‌ దళం కూడా ధ్రువీకరించింది. నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఫహీమ్‌ దష్తీతో పాటు అబ్దుల్‌ వదూద్‌ జోర్‌ కూడా మరణించినట్టు తెలిపింది.

మరోపక్క, అఫ్ఘాన్‌ పతనం తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్.. కాబుల్‌ను సందర్శించారు. ఆయన వెంట పాక్‌ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్‌ అఫ్ఘాన్‌ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్‌ఐ చీఫ్‌ను ఆహ్వానించడంతో వారి మధ్య ఉన్న సంబంధాలు తేటతెల్లమవుతున్నాయి.

పాకిస్తాన్‌ చేతిలో కీలుబొమ్మలుగా మారారు తాలిబన్లు. అఫ్ఘాన్‌లో తాలిబన్లు తాము చెప్పినట్టు నడుచుకునేలా పాక్‌ ఐఎస్‌ఐ శిక్షణ ఇస్తోంది. పంజ్‌షిర్‌ వ్యాలీలో తాలిబన్లకు పాకిస్తాన్‌ అన్ని విధాలా సాయం చేస్తోంది. అల్‌ఖైదా ఉగ్రవాదులతో పాటు పాక్‌ సైనికులు కూడా తాలిబన్ల తరఫున పోరాటం చేస్తునట్టు చెబుతున్నారు.

తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేపట్టాలన్నా.. నిర్ణయించేది పాక్‌ ఐఎస్‌ఐ అని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. పంజ్‌షిర్‌పై దాడులు చేసేందుకు పాక్‌ వైమానిక దళం.. తాలిబన్లకు సహకరిస్తోంది. పంజ్‌షిర్‌కు అన్ని రకాల నిత్యావసరాల సరఫరా, రోడ్లను తాలిబన్లు బ్లాక్‌ చేసేశారు. ఈ పోరులో ఇరువైపులా చాలా మంది మరణించారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి.