ఆకాశంలో అద్భుత దృశ్యం, విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యగ్రహణాల్లో

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 05:38 AM IST
ఆకాశంలో అద్భుత దృశ్యం, విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యగ్రహణాల్లో

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్(జ్వాలా వలయ)‌ సందడి చేస్తోంది. పలు ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో(2020) ఇదే తొలి సూర్యగ్రహణం.

జ్వాలా వలయం-Ring Of Fire అంటే:
వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా(Ring Of Fire) పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.

సుందర దృశ్యంగా రింగ్ ఆఫ్ ఫైర్:
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం మొదలైంది. మన దేశంలో మాత్రం 10.14 గంటలకు పూర్తి స్థాయిలో గ్రహణం కనిపించింది. గగనతలంలో వలయాకార సూర్యగ్రహణం(రింగ్ ఆఫ్ ఫైర్) అరుదైన సుందర దృశ్యంగా కనువిందు చేస్తోంది. సూర్యుడి కేంద్రం భాగం కనిపించకుండా చందమామ అడ్డు వచ్చింది. మధ్యాహ్నం 3.04 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో గ్రహణం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు గ్రహణం దర్శనమీయనుంది.

డిసెంబర్ లో మరోసారి సూర్యగ్రహణం:
మన దేశంలో గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకలో తొలుత గ్రహణం కనిపించింది. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం, ఏపీలో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ మూసేశారు. గ్రహణం విడుపు తర్వాత మహా సంప్రోక్షణం చేస్తారు. ఆ తర్వాత ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మళ్లీ 2022లో సూర్యగ్రహణం ఏర్పడుతుందన్నారు. 

చూడామణి యోగంలో జపం, దాన, ధర్మాలు చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం:
జ్యోతిషం ప్రకారం.. శార్వరీ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిర నక్షత్రం, మిథున రాశిలో రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది దక్షిణభారతంలో ఖండగ్రాసం, ఉత్తర భారతంలో కంకణాకారంలో కనిపిస్తుంది. దీన్నే ‘చూడామణి యోగం’అని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇది విశేషమైన సూర్యగ్రహణమని పండితులు అంటున్నారు. ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం, సోమవారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడితే దాన్ని చూడామణి యోగంగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సాధారణ గ్రహణ సమయంలో చేసే జపం, దాన, ధర్మాలు చూడామణి యోగంలో చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

గ్రహణాన్ని నేరుగా చూడొద్దు:
కాగా, సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దని శాస్త్రవేత్తలు కోరారు. అలా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని హెచ్చరించారు. తగిన రక్షణ జాగ్రత్తలతో వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతో, ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడాలన్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమన్నారు. కాగా, గ్రహణం కారణంగా భూమిపైకి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్‌ కొంతమేరకు (0.001 శాతం) నశించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

Read: ఏపీ, తెలంగాణలో సూర్యగ్రహణం కనిపించేది ఎప్పుడంటే