కరోనా విలయతాండవం…స్పెయిన్ లో ఒక్కరోజే 769మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2020 / 01:15 PM IST
కరోనా విలయతాండవం…స్పెయిన్ లో ఒక్కరోజే 769మంది మృతి

ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో స్పెయిన్ మరణాల సంఖ్య 4వేల 858కి చేరుకుందని తెలిపింది. అంటే ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది.

ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు ఇటలీ తర్వాత స్పెయిన్ లోనే నమోదయ్యాయి. అయితే ఒక్కరోజులో నమోదైన మరణాలు ఇటలీ కన్నా స్పెయిన్ లోనే ఎక్కువ. రికార్డు మరణాలు స్పెయిన్ లో నమోదవడం అందరినీ టెన్షన్ కు గురిచేస్తోంది. అంతేకాకుండా స్పెయిన్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 64వేలు దాటింది. స్పెయిన్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. రోజుకి దాదాపు 8వేల మంది వరకు కరోనా బారిన పడుతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. కరోనా టెస్టింగ్ రేటు కూడా భారీగా పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల నుంచి లక్షల కరోనా టెస్టింగ్ కిట్ ల కోసం  స్పెయిన్ ఆర్డర్ ఇచ్చింది. కరోనా కేసుల సంఖ్య పెరిగినప్పటికీ…కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు తక్కువ శాతం ఉన్నట్లుగా కనిపిస్తోంది. గురువారం 18శాతం పెరుగుదల ఉంటే శుక్రవారం 14శాతం మాత్రమే కొత్త కేసుల పెరుగుదల ఉంది.

మరోవైపు 198 దేశాల‌కు క‌రోనా వైర‌స్ పాకింది. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ఐదున్న‌ర ల‌క్ష‌ల‌కు క‌రోనా బాధితులు సంఖ్య చేరింది. క‌రోనా మ‌హమ్మారి ఇప్పటి వ‌ర‌కు 24వేల మందిని బ‌లితీసుకుంది. ఐరోపా ఖండంలోనే 80శాతం మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. కరోనాకు హాట్ స్పాట్ గా ఉన్న యూరప్ లోని ఇటలీలో ఇప్పటివరకు 8వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80వేలమందకి పైగా ఇటలీలో కరోనా కేసులు నమోదయ్యాయి.