వ్యాక్సిన్ కోసం…చైనాకు పాక్ ప్రత్యేక విమానం

వ్యాక్సిన్ కోసం…చైనాకు పాక్ ప్రత్యేక విమానం

Special plane కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్​ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం(జనవరి-31,2021) పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)కి చెందిన ప్రత్యేక విమానం చైనాకి వెళ్లింది. చైనాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ 5 లక్షల టీకా డోసులు తీసుకొచ్చేందుకు విమానం పంపినట్లు పాకిస్తాన్ కి చెందిన నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్(NCOC) తెలిపింది. జనవరి 31లోపు 5 లక్షల డోసులను అందించే విధంగా చైనాతో ఈ నెల ప్రారంభంలో పాక్​ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

చైనీస్ సినోఫార్మ్​ వాక్సిన్​తో కలిపి రెండు కరోనా టీకాలను అత్యవసర వినియోగానికి పాక్​ ఇప్పటికే అనుమతించింది. దేశంలో వాక్సిన్​ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఇస్లామాబాద్​లో వ్యాక్సిన్ లను నిల్వచేసి అన్ని రాష్ట్రాలకు అందించనున్నట్లు ఎన్​సీఓసీ తెలిపింది. మొదటగా ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు, వద్ధులకు వాక్సిన్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం ఎన్​సీఓసీ వద్ద ఓ కంట్రోల్ సెల్ ను ఏర్పాటుచేశామని,అదేవిధంగా రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

పాకిస్తాన్​లో ఇప్పటి వరకు 5,44,813 కరోనా కేసులు నమోదవగా..11,657 మరణాలు నమోదయ్యాయి. 499,974మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2,111 రోగులు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక,ఈ ఏడాది ప్రథమార్ధంలోగా పాకిస్థాన్​కు 17 లక్షల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను అంతర్జాతీయ వ్యాక్సిన్ సమన్వయ సంస్థ ‘కోవాక్స్​’ అందించనుందని పాకిస్తాన్ మంత్రి అసద్​ ఉమర్​ ట్వీట్​ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్​ అలియన్స్​ ఫర్​ వాక్సినేషన్ అండ్​ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో ‘కొవాక్స్​’ ఏర్పడిన విషయం తెలిసిందే.