Happy Christmas : క్రిస్మస్‌కు బహుమతులిచ్చే తాత..శాంతాక్లాజ్ కథ

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 10:45 AM IST
Happy Christmas : క్రిస్మస్‌కు బహుమతులిచ్చే తాత..శాంతాక్లాజ్ కథ

క్రిస్మస్ అంటే చిన్నారులకు గుర్తుకు వచ్చిది చక్కని బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతయ్యే. ఈ క్రిస్మస్ తాతయ్యను పశ్చిమదేశాలవారు  శాంటాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నారుల్ని ఆకట్టుకునే క్మిస్మస్ తాత అంటే చిన్నారులకు చాలా ఇష్టం. తాత అంటే చిన్నారులకు ఎప్పుడూ ఇష్టమే. క్రిస్మస్ తాత బహుమతులు కూడా ఇస్తాడు కాబట్టి చిన్నారులకు క్రిస్మస్ తాత అంటే ఇంకా ఇష్టం. చాక్లెట్లు,కేకులు,బిస్కెట్లు ఇలా ఎన్నో బహుమతులు తీసుకొచ్చే క్రిస్మస్ తాత అంటే చిన్నారులు ఎగిరి గంతులేస్తారు.  

చిన్నారులకు ఆకట్టుకునే చిరునవ్వుతో మంచు కొండలమీదుగా ధృవపు జింకల బగ్గీపై  వచ్చి క్రిస్మస్ చెట్టుకు తాము వేలాడదీసిన మేజోళ్లలో బహుమతులు పెట్టి వెళతాడని క్రిస్మస్ పండుగ సమయంలో పిల్లలు ఎదురు చూస్తుంటారు. 

ఈ క్రిస్మస్ తాత కథ వెనుక ఒక యదార్థ గాథ ఉంది. 13 వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని సమస్యను గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటిమీదున్న పొగగొట్టంలో నుంచి 3 బంగారు నాణాలున్న సంచులను జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి  పొయ్యిపక్కనే ఆరేసిన మేజోళ్ళలో (సాక్సులు) పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు  ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగువారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. 

ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకటంతో బీదలంతా తమకూ ఎంతోకొంత సాయం అందుతుందని ఎదురు చూడటం మొదలు పెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతయ్యల రూపంలో తమ ప్రాంతంలోని పేదలకు రహస్యంగా సాయం చేయటం మొదలుపెట్టారు.   అలా మొదలైన ఈ సహాయం క్రమంగా విస్తరించి నేడు శాంటా క్లాజ్ రూపంలో కొనసాగుతోంది.