గుండెల్ని పిండేసే దృశ్యం : హంస కోసం 23 రైళ్లు ఆలస్యం

గుండెల్ని పిండేసే దృశ్యం : హంస కోసం 23 రైళ్లు ఆలస్యం

swan mourning the death : హంస. రాజసానికే కాదు అందానికి మారుపేరు. రాయంచ నడక అని కవులు ఊరికనే అనలేదు. హంసలు నడిస్తే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. అవి నీటిలో ఈదుతుంటే అలా కళ్లార్పకుండా చూస్తుండిపోవాలనిపిస్తుంది. కానీ అటువంటి అందాల హంసలు ప్రమాదంలో చిక్కుకుంటే మనస్సు కలుక్కుమంటుంది. మనస్సుని పిండేస్తుంది.

అదే జరిగింది ఓ రైల్వే ట్రాక్ మీద. రెండు హంసలు ఎందుకెళ్లాయో..ఎలా వెళ్లాయోగానీ రైల్వే ట్రాక్ మీదకెళ్లాయి. ఈక్రమంలో ఓ హంస ఓవర్ హెడ్ పవర కేబుల్ లో చిక్కుకుని చనిపోయింది. దీంతో అక్కడనే ఉన్న మరొక హంస ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో చనిపోయిన హంసకేసి చూస్తుండి పోయింది. ఆ సమయంలో ఆ హంస మనోవేదన అర్థం చేసుకుంటే..బహుశా మనిషన్నవాడు ఎటువంటి నేరాలు చేయలేడేమో.. చనిపోయిన తోటి హంసను చూస్తూ మూగ వేదనతో తల్లడిల్లిపోయిందా హంస.

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బతికున్న హంసను పక్కకు తీసే యత్నం చేశారు. కానీ దాని బాధ వారికి అర్థం అయిందేమో అంత ధైర్యం చేయలేకపోయారు. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు ఆ హంసను అక్కడనే దాదాపు గంటసేపు ఉండనిచ్చారు. కానీ తప్పదు. ఆ హంస మృతదేహాన్ని ఎట్టకేలకు తొలగించారు.

గుండెల్ని పిండేసే ఈ హంసల ఘటనతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రేమ, భావోద్వేగాలు జంతువుల్లో కూడా ఉంటాయి మరి. మనిషుల్లో రోజు రోజుకీ మానవత్వం చచ్చిపోతోంది. కానీ పశుపక్షాదుల్లో మాత్రం సాటి జంతువుల పట్ల సాటి పక్షుల పట్ల అవి ప్రేమను చూపిస్తునే ఉంటాయనటానికి ఈ హంసల దుర్ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.