నోబెల్ శాంతి బహుమతి రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్

నోబెల్ శాంతి బహుమతి రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్

Sweden girl Greta Thunberg  nominated for Nobel Peace Prize : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా నోబెల్ శాంతి బహుమతి రేసు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో స్వీడన్ కి చెందిన పాఠశాల బాలిక గ్రెటా థన్ బెర్గ్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు. బాల పర్యావరణవేత్తగా గ్రెటా థన్ బెర్గ్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.

చిన్ననాటే పర్యావరణానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతూ..పలు అంతర్జాతీయ వేదికల మీద గ్రెటా ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సారి నోబెల్ శాంతి పురస్కారం రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా ఉన్నారు.

18 ఏళ్ల గ్రెటా థన్ బెర్గ్ చిన్న వయసులోనే ప్రపంచ పర్యావరణంపై ఎలుగెత్తుతున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అనేక ప్రపంచవేదికలపై పర్యావరణ అంశాలపై ఆమె ధైర్యంగా గళం విప్పిందీ స్వీడన్ కు చెందిన గ్రెటా. పర్యావరణం గురించి ఆమె చేస్తున్న పోరాటానికి ఇప్పటికే గ్రెటా పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంది.

అలాగే రష్యాకు చెందిన అలెక్సీ నావల్నీ తన దేశంలో శాంతియుత ప్రజాస్వామ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవలే విషప్రయోగం కూడా జరిగింది. దీంతో నావల్నీ ఐదు నెలలు జర్మనీలో చికిత్స పొంది ప్రాణాలతో బైటపడ్డారు. అయితే ఇటీవలే జర్మనీ నుంచి రష్యా వచ్చిన నావల్నీని అరెస్ట్ చేయడంతో రష్యాలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అలాగే గ్రెటా, అలెక్సీ నావల్నీ తోపాటు ఈసారి నోబెల్ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండటం విశేషం.

అంతేకాదు..వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌వో, ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్‌ కూడా నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా..ఈ నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే నోబెల్‌ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా బయటపెట్టలేదు. 50ఏళ్లుగా ఈ కమిటీ నామినీల పేర్లను, రేస్‌లో ఉండి అవార్డు రాని వాళ్ల పేర్లను బయటపెట్టడం లేదు. కానీ నామినేటర్లు మాత్రం తమ నామినీల పేర్లను వెల్లడించవచ్చు. నోబెల్‌ బహుమతులను 2021 అక్టోబర్‌లో ప్రకటించనున్నారు.