Sweden PM : స్వీడన్ ప్ర‌ధాని రాజీనామా

స్వీడన్ ప్ర‌ధానమంత్రి స్టీఫెన్ లోఫ్‌వెన్ సోమవారం(జూన్-28,2021) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

Sweden PM : స్వీడన్ ప్ర‌ధాని రాజీనామా

Sweden

Sweden PM స్వీడన్ ప్ర‌ధానమంత్రి స్టీఫెన్ లోఫ్‌వెన్ సోమవారం(జూన్-28,2021) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. జూన్-21,2021న స్వీడన్ పార్లమెంట్ లో స్టీఫెన్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఆయ‌న త‌న‌ పదవికి రాజీనామా చేయడానికి స్పీకర్ వారం రోజుల సమయం ఇచ్చారు. నేటికి వారం రోజుల గ‌డువు పూర్తి కావ‌డంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన స్టీఫెన్ తన రాజీనామా ప్రకటించారు. దీంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవ‌డంలో విఫ‌ల‌మై ప‌ద‌విని పోగొట్టుకున్న తొలి స్వీడ‌న్ ప్ర‌ధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ నిలిచారు.

కాగా, కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అద్దె నియంత్రణలను తగ్గించే ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, దానికి మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీకి మధ్య విభేదాలు వెలగుచూశాయి. దీంతో లెఫ్ట్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న స్వీడన్ డెమోక్రాట్స్(ఎస్.డి) పార్టీ పార్లమెంటులో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్టారు. మొత్తం 349 సీట్లు ఉన్న స్వీడ‌న్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 181 మంది చట్టసభ్యులు ఓటేశారు. ఫలితంగా 2014 నుంచి స్వీడన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ లోఫ్‌వెన్ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మ‌రో వ్య‌క్తిని ప్ర‌ధానిగా ఎంపిక చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మా, లేదంటే ఎన్నికలకు వెళ్లాడ‌మా అనే విషయంలో స్పీకర్ నిర్ణ‌యం తీసుకోనున్నారు. కొత్త ప్రధాని ఎంపిక విఫలమైతే 2022 సెప్టెంబరులో జరగనున్న ఎన్నికలను ఒక సంవత్సరం కన్నా ముందుగానే ఎన్నికలకు ఆదేశించవచ్చు.