ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని పెంచదు, స్టడీ

  • Published By: naveen ,Published On : August 13, 2020 / 01:23 PM IST
ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని పెంచదు, స్టడీ

కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పుడు పెయిన్ కిల్లర్ ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడటం మరింత ప్రమాదానికి దారి తీస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుందనే భయాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తొలి రోజుల్లో ఫ్రెంచ్ హెల్త్ మినిస్టర్ ఇలాంటి హెచ్చరిక జారీ చేశారు. తాజాగా యూకే స్టడీలో కొత్త విషయం వెలుగుచూసింది. ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని పెంచదనే విషయం వారి స్టడీలో తెలిసింది.

యూనివర్సిటీ ఆఫ్ అబర్ డీన్ పరిశోధకులు ఓ స్టడీ చేశారు. 8 బ్రిటీష్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 1222 మంది కరోనా బాధితులపై రీసెర్చ్ చేశారు. వారిలో 54మందికి నాన్ స్టెరాయిడల్ ఇన్ ఫ్లామేటరీ డ్రగ్స్-NSAID(ఐబుప్రొఫెన్, న్యాప్రోక్సెన్, డైక్లోఫినాక్) ఇచ్చారు. ఈ పిల్స్ తీసుకున్న వారిలోనూ, తీసుకోని కరోనా రోగుల్లోనూ మరణాల రేటు సమానంగా ఉంది. NSAID డ్రగ్స్ రొటీన్ గా వాడటం వల్ల కరోనా రోగుల్లో ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించడం లేదని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన బ్రూస్ చెప్పాడు. కాగా, తాము చేసిన పరిశోధనతో పూర్తిగా ఓ నిర్దారణకు రాలేమన్నారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే NSAID డ్రగ్స్ వినియోగంపై ఓ నిర్ధారణకు రాగలమని చెప్పారు.

తీవ్రమైన నొప్పి, రుమటలాజికల్ వ్యాధులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా సూచించబడిన మరియు ఉపయోగించే నొప్పి మందులే(పెయిన్ కిల్లర్స్) NSAID. కాగా ఈ పరిశోధన ఫలితాలను పరిగణలోకి తీసుకోని NSAID డ్రగ్స్ ఎక్కువగా వినియోగించొద్దని పరిశోధకులు కోరారు. డాక్టర్ సూచన మేరకే డ్రగ్స్ వాడాలని చెప్పారు.

కాగా, కరోనా‌వైరస్‌కు ముందుగా ఐబుప్రోఫెన్ పని చేయదని వైద్య నిపుణులు చెప్పారు. ఒక వేళ ఇతర ఆరోగ్య సమస్యలకి ఐబుప్రోఫెన్ తీసుకుంటూ ఉంటే డాక్టర్ సలహా లేకుండా మానవద్దని సూచించారు. వాస్తవానికి పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ మందులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, జలుబు లాంటి లక్షణాలకి పని చేస్తాయి. కానీ ఈ మందులు అందరికీ పడవని వాటి వలన ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆస్తమా, గుండెకు సంబంధించిన సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత చేటు చేస్తుందని తెలిపారు.

గతంలో నేషనల్ హెల్త్ సర్వీస్ వెబ్ సైట్‌లో పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడవచ్చని సూచించింది. కానీ, ఈ సమాచారాన్ని తర్వాత సవరిస్తూ, ఐబుప్రోఫెన్ వలన కరోనావైరస్ తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఒకవేళ కరోనావైరస్ లక్షణాలు గుర్తిస్తే తగిన మందులు తెలిసేవరకు పారాసెటమాల్ వాడమని సూచించింది. డాక్టర్ పారాసెటమాల్ పడదని సూచిస్తే వాడొద్దని పేర్కొంది.

ఐబుప్రోఫెన్ తీసుకోవడం వలన కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వేరే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని లండన్ స్కూల్ అఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కి చెందిన వైద్యుడు డాక్టర్ చార్లొట్ గారెన్ వాష్ చెప్పారు. వ్యాధి లక్షణాలు కన్పించగానే పారాసెటమాల్ తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారు ఐబుప్రోఫెన్ మందు తీసుకోవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని అందుకే ఇటలీలో తీవ్ర స్థాయిలో ఈ వైరస్ ప్రబలిందని గతంలో వార్తలు వచ్చాయి.

ఐబుప్రోఫెన్ వాడితే కోవిడ్ 19 లక్షణాలకి పని చేస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి పరిశోధనలు జరగలేదు. కానీ, ఇతర శ్వాస సంబంధిత సమస్యల్లో ఐబుప్రోఫెన్ వాడటం వలన మరిన్ని సమస్యలకి దారి తీయడం కానీ, వ్యాధి పెంపొందడం కానీ జరగవచ్చని కొన్ని వైద్య అధ్యయనాలు ఉన్నట్లు యూనివర్సిటీ అఫ్ సౌత్ అంప్తన్ ప్రైమరీ కేర్ రీసెర్చ్ ప్రొఫెసర్ పాల్ లిటిల్ తెలిపారు. అయితే ఇది ఐబుప్రోఫెన్ వలన జరుగుతుందని నిర్ధారించలేమని ఆయన చెప్పారు. కొంత మంది వైద్య నిపుణులు ఐబుప్రోఫెన్‌లో ఉన్న కొన్ని పదార్ధాలు శరీరపు రోగ నిరోధక శక్తిని తగ్గించవచ్చని చెబుతారు.