ఓటరు సాహసం: వేలు నరికేసినా..మళ్లీ ఓటేశాడు

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 06:37 AM IST
ఓటరు సాహసం: వేలు నరికేసినా..మళ్లీ ఓటేశాడు

ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.  శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. 

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. బాంబులతో విరుచుకుపడుతు ఘోరాలు సృష్టిస్తుంటారు. తాము చెప్పినట్లే ప్రజలు ఉండాలని ఆంక్షలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎన్నికల్ని వ్యతిరేకిస్తు తాలిబన్లు ప్రజల్ని హెచ్చరించారు. అంతేకాదు ఎన్నికల క్యాంపెయిన్ లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

తాలిబన్లకు భయపడి చాలామంది ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ముందుకు రావటంలేదు. కానీ సఫియుల్లా సఫీ అనే ఓటరు ఓటు వేయటానికి చూపిన ధైర్యసాహసాలు ప్రస్తుతం చర్చగా మారాయి. 2014 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయటానికి వీల్లేదని తాలిబన్లు హెచ్చరించారు. కానీ సఫియుల్లా సఫీ ఓటు వేయటం మానలేదు. ఓటు వేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన తాలిబన్లు మా హెచ్చరికల్నే పట్టించుకోకుండా ఓటు వేసినందుకు శిక్ష అనుభవించి అంటూ..సఫియుల్లా సఫీ వేలు  నరికేశారు. 

2019 అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాలిబన్లు ఓట్లు వేయవద్దంటూ ప్రజల్ని హెచ్చరించాడు. కానీ శనివారం జరిగిన ఎన్నికల్లో సైతం 38 ఏళ్ల సఫియుల్లా సఫీ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నా  తలను తీసేసినా ఓటు వేయకుండా మానేది లేదంటూ ఓటు వేసి వేసి చూపించాడు. తన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అతను చూపిన ధైర్య సాహసాలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
మరోవైపు..ఆఫ్ఘన్ ఎన్నికల్లో పలు చోట్ల హింస చెలరేగింది. తిరుగుబాటుదారులు పోలింగ్‌ కేంద్రాలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు మరణించారు. 27 మంది గాయపడ్డారు. 
కాగా 2014 ఎన్నికల్లో ఓట్లు వేసిన ఆరుగురి వేళ్లను తాలిబన్లు నరికివేశారు. ఆనాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్న సఫియుల్లా మాట్లాడుతూ..ఇది చాలా బాధాకరమైన విషయమనీ..నా చేతిని మొత్తం నరికేసినా..నా తల నరికేసినా ఓటు వేయటం మానని తేల్చి చెబుతున్నాడు సఫీ.