Taliban : మహిళల హక్కులకు ఇస్లామిక్ వ్యవస్థ మాత్రమే మార్గం

ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తాలిబాన్ సంస్థ తెలిపింది.

Taliban : మహిళల హక్కులకు ఇస్లామిక్ వ్యవస్థ మాత్రమే మార్గం

Taliban Insists Genuine Islamic System Only Way To Women Rights

Taliban ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్..తమ విధానాలు, ఉద్దేశాలను తాలిబాన్ సంస్థ పూర్తిగా స్పష్టం చేసింది.ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తాలిబాన్ సంస్థ తెలిపింది. ఆఫ్గనిస్తాన్‌లో దశాబ్దాల యుద్ధానికి తెరపడాలన్నా,మహిళల హక్కులకు భరోసా ఉండాలన్నా అసలు సిసలు ఇస్లామిక్ విధానమే ఏకైక మార్గమని తాలిబన్ ఆదివారం ప్రకటించింది.

ఆఫ్గన్ల సమస్యలన్నిటికీ అత్యుత్తమ పరిష్కార మార్గం..ఇస్లామిక్ విధానాన్ని యథాతథంగా అమలు చేయడమేనని తాలిబన్ పొలిటికల్ ఆఫీస్ చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. విదేశీ దళాలను ఉపసంహరించిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేదాని గురించి ప్రపంచానికి, ఆఫ్ఘన్లకు అనేక ప్రశ్నలు ఉన్నట్లు తమకు తెలుసునన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి అత్యుత్తమమైనది అసలు సిసలు ఇస్లామిక్ వ్యవస్థ అని తెలిపారు. మహిళలు, మైనారిటీలు సహా ఆఫ్ఘన్ల హక్కులకు ఆఫ్ఘన్ సంప్రదాయాలు, దివ్యమైన ఇస్లామ్ మతం ప్రకారం రక్షణ ఉంటుందని చెబుతున్న బరదార్.. మహిళలు బహిరంగంగా వివిధ పాత్రలు పోషించేందుకు అవకాశం కల్పిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వర్క్‌ప్లేస్‌లు, పాఠశాలల్లో స్త్రీ, పురుష వివక్ష ఉండబోదని కూడా క్లారిటీగా చెప్పలేదు.

మరోవైపు,అమెరికా దళాలు ఆఫ్గనిస్తాన్ నుంచి క్రమంగా వైదొలుగుతున్న వేళ తాలిబాన్‌ సంస్థ తమ పరిధిని గణనీయంగా పెంచుకుంటోంది. దీంతో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను భవిష్యత్‌ లో ఎదుర్కోవలసి వస్తుందని ఆఫ్గన్ మహిళల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తాలిబాన్ పాలనలో గరిష్టంగా మహిళ మరణాలే ఎక్కువగా జరిగినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. తమ పాలన సమయంలో మహిళల విద్య, క్రీడలు, సంగీతం మొదలైన వాటిని తాలిబాన్ పూర్తిగా నిషేధించింది. అదేవిధంగా స్త్రీలు రోడ్డు మీద లేదా ఎక్కడా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 9/11 దాడుల అనంతరం అమెరికన్ బలగాలు ఆఫ్ఘాన్‌ రావడంతో మహిళల్లో కొంత ఊరట లభించడంతోపాటు బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే హక్కు లభించిందని ప్రజలు సంబురపడ్డారు.

అయితే, శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చే సెప్టెంబర్‌ 11 కల్లా అమెరికా, నాటో దళాలు పూర్తిగా ఆఫ్గనిస్తాన్‌ నుంచి విరమించుకుంటుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాలిబాన్‌ మరోసారి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండటంతో ప్రజలు నిద్రకు దూరం అవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను తాలిబాన్ ఆక్రమించుకున్నది. గతంలో మాదిరిగా కాబూల్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తాలిబాన్‌ ఉద్దేశంగా ఉన్నది. ఇక,ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆఫ్ఘన్ల మధ్య చర్చలు కతార్‌లో జరుగుతున్నాయి. యధార్థమైన శాంతి చర్చలు జరిపేందుకు స్టార్టింగ్ పాయింట్ గా ఉపయోగించబడే రాతపూర్వక శాంతి ప్రపోజల్ ను తాలిబన్ ఇంకా సమర్పించలేదని ఆఫ్గన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో 2001 నుంచి జరుగుతున్న మార్పులకు, తాలిబన్లు చెప్తున్న విధానానికి మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.