అమెరికాకు హెచ్చరిక : తాలిబన్లతో ట్రంప్ రహస్య భేటీ రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 02:24 AM IST
అమెరికాకు హెచ్చరిక : తాలిబన్లతో ట్రంప్ రహస్య భేటీ రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దు చేస్తూ  ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్రరాజ్యానికి హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల ఎక్కువ మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతారని తాలిబాన్లు  హెచ్చరించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొండలలోని క్యాంప్ డేవిడ్ దగ్గర  తాలిబాన్ ప్రధాన నాయకులతో జరగాల్సిన ముఖాముఖి రహస్య చర్చలను డొనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా రద్దు చేసిన కొన్ని గంటల తరువాత ఇస్లామిస్ట్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

గత వారం కాబూల్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఒక అమెరికన్ సైనికుడు, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబ్ బ్లాస్ట్ చేసింది తామేనని తాలిబన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. అయితే తాలిబన్లు ఈ బాంబు దాడికి పాల్పడటంతో వారితో రహస్య చర్చలకు గుడ్ బై చెబుతున్నాను అంటూ రెండు రోజుల క్రితం ట్రంప్ ట్వీట్ చేశారు. చర్చల్లో పైచేయి సాధించటం కోసం ఇలా చంపుకుంటూ పోతారా? ఎన్ని దశాబ్దాలు ఇలా పోరాటం సాగించాలనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత జఠిలంగా మారుస్తాయి. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదని ట్రంప్ తన ట్వీట్ లో తెలిపారు. ఆదివారం చర్చలకు ముందే తాలిబాన్ నాయకులు పరపతి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తాలిబన్‌ నేతలతోపాటు అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకుంటున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

ట్రంప్ చర్చలు విరమించుకోవడాన్ని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విమర్శించారు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని  చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ తో శాంతి చర్చలు నిలిచిపోయాయని, తాలిబాన్ ఏదైనా ముఖ్యమైన కట్టుబాట్లను అనుసరించగలదని ఒప్పించే వరకు ఈ ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించుకోమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ సృష్టం చేశారు.  దీంతో అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా– తాలిబన్‌ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.