Tech Jobs Cuts : కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం .. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం..వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన..

కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.

Tech Jobs Cuts : కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం .. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం..వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన..

Financial Crisis Effect ..Tech Jobs Cuts

Tech Jobs Cuts : భారత ఐటీ రంగం కరోనాను తట్టుకుని నిలబడింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణతో.. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులకు ఢోకా లేకుండా పోయింది. విపరీతంగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో కంపెనీలు తమ అవసరం కోసం వేలమందిని రిక్రూట్‌ చేసుకున్నాయి. హెడ్‌ కౌంట్‌ను పెంచుకున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో అప్పుడంతా వ్యాపార కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే సాగాయి. జులై 2020 నుంచి సెప్టెంబర్ 2022 మధ్య దేశంలోని టాప్‌ 10 ఐటీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌లో మూడోవంతు మందిని నియమించుకున్నాయి. ఈ సంఖ్య సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ఉద్యోగులు కూడా భరోసాతో పనిచేశారు. దానికి తగ్గట్టే చాలా కంపెనీల ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నికర లాభం కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. భారత ఐటీ రంగం వృద్ధిని చూసి అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయింది. దాంతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డాయి. లాభాలు తగ్గడం, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులతో పాటు మాంద్యం ఎదురు కావొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగుల్ని తగ్గించుకోవడంపైనే ఫోకస్‌ చేశాయి. 2022లో అక్టోబర్ చివరి నాటికి.. ఇప్పటివరకు US టెక్ సెక్టార్‌లో 45,000 కంటే ఎక్కువ మంది కార్మికులు భారీ ఉద్యోగాల కోతలతో తొలగించబడ్డారు. కొన్ని కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించగా..మరికొన్ని నియామకాలను స్తంభింపజేశాయి. ఉద్యోగాలను తగ్గించిన లేదా హైరింగ్ ఫ్రీజ్‌ని ప్రకటించినవాటిల్లో పెద్దా చిన్నా కంపెనీలు కూడా ఉన్నాయి.

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో టాప్-3లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా నియామకాల్ని తగ్గించుకున్నట్లు తెలిసింది. ఐటీ సంస్థలకు అయ్యే మొత్తం ఖర్చుల్లో 55 నుంచి 65 శాతం వరకు.. స్టాఫ్ కాస్ట్స్ అంటే వారి వేతనాలకే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్ని తగ్గించుకుంటేనే ఖర్చులు తగ్గుతాయన్న భావనలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇక దేశంలోని టాప్‌ టెన్‌ కంపెనీల్లో లెక్క తీసుకుంటే.. అందులోని ఐదు సంస్థల్లో సేల్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ గణనీయంగా తగ్గినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఎంతలా పడిపోయిందంటే.. నాన్ రెవెన్యూ జనరేటింగ్ పీపుల్‌ను తగ్గించుకోవడమే కాకుండా.. అనధికారికంగా ఐటీ రంగంలో నియామకాల్ని కూడా ఫ్రీజ్‌ చేశాయి.

Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు..ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు..టెకీల్ని రోడ్డున పడేస్తున్న ద్రవ్యోల్బణం

ఇప్పటికే టీసీఎస్ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. తర్వాత టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నట్లు కూడా టాక్‌ నడిచింది. ఇక- అసెంచర్ ఇండియా యూనిట్.. వేలమంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించింది. ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్‌పీరియెన్స్ లెటర్స్ పెట్టి ఉద్యోగాలు పొందారన్న కారణంతో ఈ పని చేసినట్లు తెలిసింది. భారత్‌లో ఐటీ కంపెనీలు ఇప్పటికే ఓవైపు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నా.. మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. మూన్‌లైటింగ్ భయాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ భయాలతో విప్రో.. ఒకేసారి 300 మందిని తొలగించింది. ఆ తర్వాత పలు ఐటీ కంపెనీలు దీనిని వ్యతిరేకిస్తూ గళం విప్పాయి. అయితే.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా మాత్రం ఒకేసారి రెండు ఉద్యోగాలు చేసుకోవడం తప్పేమీ కాదని, దానికి తాము మద్దతిస్తామని చెప్పడం విశేషం. దీంతో ఐటీ రంగంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి.

Elon Musk Warning: అలాచేస్తే ట్విటర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఎలాన్ మస్క్

మరోవైపు ఐటీ కంపెనీలే కాదు.. ఎడ్‌టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. లాక్‌డౌన్ కాలంలో బైజూస్ లాంటి ఎడ్‌టెక్ కంపెనీలకు బాగానే గిరాకీ ఉండేది. కానీ ఇప్పుడు కరోనా తగ్గి పరిస్థితులు సాధాణ స్థితికి చేరుకున్న తరుణంలో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో ఎడ్‌టెక్ కంపెనీలపై ఆధారపడటం తగ్గింది. ఆన్‌లైన్ క్లాస్‌లు, లెర్నింగ్ యాప్స్ వాడకం తగ్గిపోయింది. దీంతో గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బైజూస్‌కు నష్టాలు భారీగా వచ్చాయి. ఏకంగా 4500 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే 2500మంది ఉద్యోగుల్ని తొలగించుకుంది. ఒక్క బైజూసే కాదు.. వేదాంతు, లిడో లెర్నింగ్, అన్‌అకాడమీ లాంటి ఎడ్‌టెక్ కంపెనీలూ ఇదే పనిచేశాయి. అన్‌ అకాడమీ 1350 మంది.. వేదాంతు 724 మందిని వదిలించుకున్నాయి. మాంద్యం భయాలు చాలా కంపెనీలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్లింకిట్‌ ఏకంగా 1600మందికి ఉద్వాసన పలికింది. కార్స్‌ 24 కంపెనీలో 600మంది.. ఉడాన్‌లో 530.. ఓలాలో 500.. ఎంఫైన్‌లో 500.. ట్రెల్‌లో 300.. మీషోలో 300.. ఫ్రంట్‌రోలో 275.. ఫార్‌ఐలో 250.. రూపీక్‌లో 230.. లిడోలో 200 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు.

Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ముందు ఎలా ఉంటుందో అని అంతా కంగారు పడుతున్నారు. ఇప్పటికే సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాదిలోపు కచ్చితంగా ఆర్థిక మాంద్యం ఎదురవుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ దేశాల సీఈఓలు సహా భారత్‌కు చెందిన కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు.. కొత్తగా నియామకాలు కూడా నిలిచిపోతాయని చెప్తున్నారు.