India slams Pak : ఐరాస వేదికగా పాక్ కు భారత్ వార్నింగ్..ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందే

ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా మ‌రోసారి పాకిస్తాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)సమావేశంలో మరోసారి కశ్మీర్​ అంశాన్ని పాక్

10TV Telugu News

India slams Pakistan ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా మ‌రోసారి పాకిస్తాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)సమావేశంలో మరోసారి కశ్మీర్​ అంశాన్ని పాక్ లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. అంత‌ర్జాతీయ శాంతి అంశంపై పాకిస్తాన్ అంబాసిడ‌ర్ మునిర్ అక్ర‌మ్ మాట్లాడుతూ.. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన యూఎన్‌లోని భార‌త శాశ్వత కమిషన్​ కౌన్స‌ల‌ర్ డాక్ట‌ర్ కాజ‌ల్ భ‌ట్ చాలా తీవ్ర‌స్థాయిలో పాక్‌కు స‌మాధానం ఇచ్చారు.

భారత్​పై ద్వేషపూరిత ప్రచారం మానుకొని కశ్మీర్​లో ఆక్రమించుకున్న ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాక్​ను గట్టిగా హెచ్చరించారు కాజ‌ల్ భ‌ట్. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లడఖ్ మొత్తం భారత్​లో ఇప్పటికీ, ఎప్పటికీ అంతర్భాగమేనని ఆమె సృష్టం చేశారు. ఇది విడదీయరానిదని, పాకిస్థాన్​ ఆక్రమించుకున్న ప్రాంతాలు కూడా ఇందులోకే వస్తాయన్నారు. అందుకే తక్షణమే పాకిస్థాన్​ ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలన్నారు.​ పాకిస్తాన్​ చేసిన పనికిమాలిన వ్యాఖ్యల వల్ల తాను మరోసారి మాట్లాడవలసి వచ్చిందన్నారు​. ఐరాస వంటి అంతర్జాతీయ వేదికలను పాక్​.. భారత్​పై దుష్ప్రచారం చేసేందుకే వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.

భార‌త్‌పై యూఎన్ వేదిక‌గా పాకిస్థాన్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం ఇది మొద‌టిసారి కాదని, ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేందుకు పాక్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని, కానీ ఆ దేశంలో మాత్రం ఉగ్ర‌వాదులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, మైనార్టీల‌కు అక్క‌డ ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని కాజ‌ల్ భట్ అన్నారు. ఉగ్రవాదులకు బహిర్గతంగా మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు అందజేయడం, ఆయుధాలు అందించే విషయంలో పాకిస్తాన్​కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి నిషేధించిన ఉగ్రవాదుల జాబితాలో ఎక్కువమందికి ఆశ్రయం కల్పించిన ఘనత కూడా పాకిస్తాన్ దేనని కాజల్ భట్ అన్నారు.

పాకిస్థాన్‌తో స‌హా అన్ని దేశాల‌తో భారత్.. సోద‌ర సంబంధాల‌ను ఆశిస్తోంద‌ని,సమస్యలను ద్వైపాక్షికంగా, శాంతియుతంగానే పరిష్కరించుకుంటుందని కాజల్ భట్ స్పష్టం చేశారు. సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్ డిక్ల‌రేష‌న్ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు కాజ‌ల్ భ‌ట్‌ తెలిపారు. చ‌ర్చ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసే బాధ్య‌త‌ పాకిస్తాన్‌పైనే ఉంటుంద‌ని ఆమె అన్నారు. అప్ప‌టి వ‌ర‌కు సీమాంత‌ర ఉగ్ర‌వాదం ప‌ట్ల భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. పాకిస్తాన్ నుంచి చొర‌బ‌డే ఉగ్ర‌వాదుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఉగ్ర‌వాదం, హింస లేని అనుకూల వాతావ‌ర‌ణంలో మాత్ర‌మే అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌న్నారు.

ALSO READ Star Tortoises : నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

×