టెర్రరిస్ట్‌ల కరోనా వైరస్‌ దాడులు: ఐక్యరాజ్యసమితి ఆందోళన

  • Published By: vamsi ,Published On : April 10, 2020 / 12:13 PM IST
టెర్రరిస్ట్‌ల కరోనా వైరస్‌ దాడులు: ఐక్యరాజ్యసమితి ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్. బయో-టెర్రరిస్ట్ దాడులు చేసేందుకు కోవిడ్-19 మహమ్మారి అవకాశాలను కల్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

COVID-19 కి వ్యతిరేకంగా జరిగుతున్న యుద్ధాన్ని “ఒక తరం  పోరాటం”గా ఆయన అభివర్ణించారు. ఇక వైరస్ జాతులను సొంతం చేసుకునే అవకాశాలు ఉగ్ర మూకలకు ఉన్నాయని.. ఇదే జరిగితే ప్రపంచానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. కోవిడ్-19 అనేది ప్రథమంగా ఒక ఆరోగ్య సమస్య అయినప్పటికీ… దీని పర్యవసానాలు దానికి మించి ఉంటాయని వెల్లడించారు. ప్రపంచ శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అన్నారు. కరోనాపై పోరాటం సామాజిక అశాంతికి, హింసకు దారి తీసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ఈ మమమ్మారి వల్ల ప్రపంచ దేశాల బలహీనతలు, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన తీరులోని లోపాలు బయటపడ్డాయని… ఇది బయో-టెర్రరిస్ట్ దాడులకు ఒక దారిని చూపించే విధంగా ఉందని అన్నారు. కరోనా కారణంగా సామాజిక పరిస్థితులు కూడా దారి తప్పుతున్నాయని ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా దేశానికి దేశానికి మధ్య కూడా విద్వేపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయని, పరిస్థితిని మరింత దిగజార్చేందుకు తీవ్రవాదులు కూడా వారు ప్రయత్నిస్తున్నారని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఉద్దేశించి ఆయన చెప్పారు.