కరోనా వైరస్ క్రొత్త వేరియంట్.. టైమ్‌బాంబ్ కంటే ప్రమాదం!

కరోనా వైరస్ క్రొత్త వేరియంట్.. టైమ్‌బాంబ్ కంటే ప్రమాదం!

కరోనావైరస్ కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు కంగారు పెట్టేస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదట గుర్తించిన కరోనా వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను.. ఇప్పటికే పలు దేశాలలో గుర్తించారు వైరాలజీ నిపుణులు. కొత్త కరోనా వైరస్‌ స్ట్రెయిన్.. ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతుండగా.. ఇది ఇతర వైరస్‌ల కంటే ఎక్కువ ప్రభావవంతంగా వ్యాపిస్తుంది అని అంటున్నారు. అంటే ఇది మరింత సులభంగా వ్యాపిస్తుంది.

దేశంలో గురువారం(31 డిసెంబర్ 2020) ఐదుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు.. పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌ (ఎన్‌ఐవీ)కి పంపిన నమూనాల్లో నాలుగింటిలో, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటరాగేటివ్‌ బయోలజీ (ఐజీఐబీ)కి పంపిన నమూనాల్లో ఒకదాంట్లో కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఇవాళ(01 జనవరి 2021) మరో నాలుగు స్ట్రెయిన్ కేసులు రాగా.. మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో 29కు చేరింది. దేశవ్యాప్తంగా ఆరు ల్యాబుల్లో స్ట్రెయిన్ పరీక్షలు సాగుతున్నాయి.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపే కొత్త స్టెయిన్ తలనొప్పి దేశానికి వచ్చింది. మాములు కరోనా వైరస్‌తో పోలిస్తే.. స్ట్రెయిన్ కరోనా వైరస్ జాతితో మరణాలు కూడా అధికం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు వైరాలజీ నిపుణులు. దేశంలో వ్యాక్సిన్ వినియోగానికి ఇవాళ(01 జనవరి 2021) అనుమతులు లభించే అవకాశం ఉండగా.. ఈ వారంలోనే అనుమతి లభించే అవకాశం ఉంది.

అయితే కొత్త స్ట్రెయిన్ రాకుండా ఇది ఎంతవరకు పనిచేస్తుంది? అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అంచనాలు లేవు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్, పాత వైరస్ కంటే 50శాతం ప్రభావం ఎక్కువ ఉంది. దీనిని టైమ్ బాంబ్‌తో పోలుస్తున్నారు నిపుణులు. ఎక్స్‌పోనెన్షియల్ మరియు లీనియర్ రిస్క్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి, చాలా టైమ్ పడుతోందని, వైరస్ పునరుత్పత్తి రేటు 1.1 మరియు ఇన్ఫెక్షన్ ప్రాణాంతక ప్రమాదం 0.8 శాతంగా ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ ఒకరికి సోకితే.. కచ్చితంగా అతని నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

డేటా నుండి ప్రారంభ అంచనాలు ప్రకారం.. కొత్త వేరియంట్ సాధారణ COVID-19 కన్నా 50 నుంచి 70 శాతం ఎక్కువ వైరస్‌ను ప్రసారం చేయగలదని చెబుతున్నారు. ఇది ఎందుకు ఎక్కువ ప్రసారం చేయగలుగుతుందో ఇంకా ఖచ్చితంగా తెలియట్లేదని నిపుణులు వెల్లడించారు. ఇప్పుడు B.1.1.7 అని పిలువబడే ఈ వేరియంట్‌లో అసాధారణంగా పెద్ద సంఖ్యలో జన్యు మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా స్పైక్ ప్రోటీన్‌లో ఈ విధంగా వైరస్ మన కణాలలోకి ప్రవేశిస్తుంది. క్రొత్త వేరియంట్ మన రోగనిరోధక శక్తిని దెబ్బతీయడంలో వేగంగా పనిచేస్తుంది.