Afghanistan : అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం.. సర్కారు చీఫ్ ఎవరంటే..?

నేడు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 20 ఏళ్ల తర్వాత అఫ్ఘాన్‌ను తమ కబంద హస్తాల్లోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇవాళ అధికారం చేపట్టబోతున్నారు.

Afghanistan : అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం.. సర్కారు చీఫ్ ఎవరంటే..?

Afganistan

Taliban government in Afghanistan : నేడు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 20 ఏళ్ల తర్వాత అఫ్ఘాన్‌ను తమ కబంద హస్తాల్లోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇవాళ అధికారం చేపట్టబోతున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని నిన్న ప్రకటిస్తారని వార్తలు వెలువడినప్పటికీ.. వెనక్కి తగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ తాలిబన్ ప్రభుత్వ చీఫ్‌గా ఉండనున్నారు.

కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తాలిబన్‌ అగ్రనేత హైబతుల్లా అఖూంజాదా నేతృత్వం వహిస్తాడని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆయన ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా పరిపాలన జరిగేలా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడు యాకూబ్‌, భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌తో చర్చలు జరిపిన షేర్‌ మహ్మద్‌ స్తానిక్‌ జాయ్‌లకు తాలిబన్‌ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కనున్నట్టు సమాచారం.

ప్రభుత్వం ఏర్పాటుపై సంప్రదింపులు పూర్తయ్యాయని.. క్యాబినెట్‌ కూర్పుపైనా చర్చ జరిగిందని చెబుతున్నారు తాలిబన్ అగ్రనేతలు. ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వ నిర్మాణం మాదిరిగానే అఫ్ఘాన్‌లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు తాలిబన్లు. అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న రెండు వారాల తర్వాత.. పగ్గాలు చేపట్టబోతున్నారు తాలిబన్లు. గతనెల 15న కాబుల్ ఆక్రమణతో తాలిబాన్లు క్రమంగా పట్టుసాధించారు. ఆ తర్వాత అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంతో తాలిబాన్లు విజయం సాధించారు.

దేశంలో శాంతి, సామరస్యం నెలకొల్పుతామని.. భద్రతాపరమైన అంశాలకు రాజీపడబోమని చెబుతున్నారు తాలిబన్లు. అమెరికా బలగాలు పూర్తిగా తరలిపోవడంతో.. అంతర్జాతీయ సమాజాన్ని సాయం కోరుతున్నారు తాలిబాన్లు. అఫ్ఘాన్‌లో చమురు నిల్వలు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో.. తమకు సాయం చేస్తే క్రూడాయిల్‌లో మేలు చేస్తామని చెబుతున్నారు.

తమ ప్రభుత్వంలో మహిళలు, అన్ని గిరిజన తెగలకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. గడిచిన 20 ఏళ్లలో అఫ్ఘాన్‌ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారెవరూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉండని వెల్లడించారు.