అమెరికా ఎన్నికలు: నువ్వా? నేనా? ముందంజలో బైడన్.. కానీ, స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్!

  • Published By: vamsi ,Published On : November 4, 2020 / 03:25 PM IST
అమెరికా ఎన్నికలు: నువ్వా? నేనా? ముందంజలో బైడన్.. కానీ, స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో వీరిద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తుంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో బైడెన్‌ గెలిచారు.



అయితే, అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ(డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా)ని మాత్రం డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ క్లీన్‌ స్వీప్‌చేశారు. ఇప్పటివరకు ఆయనకు దాదాపు 93శాతం పాపులర్‌ ఓట్లు లభించగా.. ట్రంప్‌కు మాత్రం కేవలం 5.6శాతం మాత్రమే వచ్చాయి. ఆరు లక్షలకు పైగా జనాభా కలిగిన డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో బైడెన్‌ 2లక్షలకు పైగా పాపులర్‌ ఓట్లు సాధించారు. ట్రంప్‌ కేవలం 12వేల పైచిలుకు పాపులర్‌ ఓట్లు మాత్రమే పొందగలిగారు. అయితే, చిన్న నగరం కావడంతో ఇక్కడ ఎలక్టోరల్‌ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ మూడు బైడెన్‌ కైవసం చేసుకున్నారు.



ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో కుట్ర జరుగుతుందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే, అమెరికాలో పాపులర్‌ ఓట్లు ఎక్కువ సాధించినప్పటికీ విజయం దగ్గకపోవచ్చు. విజేతను నిర్ణయించేది మాత్రం ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే. 538 ఎలక్టోరల్‌ ఓట్లున్న అమెరికాలో 270సాధించిన వారే విజేత. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇప్పటివరకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా బైడెన్‌కు 238 ఓట్లు వచ్చాయి. మిగతా స్థానాల్లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, టెక్సాస్‌లో ట్రంప్‌ విజయం సాధించారు.



ఓవరాల్‌గా డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌‌ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత ట్రంప్‌ క్రమంగా పుంజుకొన్నారు. కీలక రాష్ట్రాలైన స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యం సాధించారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్‌ ఆధ్యిక్యంలో ఉన్నారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం అరిజోనా, న్యూహాంప్‌షైర్‌ మినహా మిగిలిన అన్ని చోట్ల ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది. ఫ్లోరిడా, ఐయోవా, ఒహైయోలో విజయం సాధించగా.. నార్త్‌ కరోలినాలో విజయానికి దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిషిగాన్‌, పెన్సిల్వేనియా, టెక్సాస్‌, విస్కాన్సిన్‌‌లలో ఆయన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో సత్తాచాటితే మరోసారి ట్రంప్‌కు వైట్ హౌస్‌లో ఉండే అవకాశం లభిస్తుంది.



అమెరికాలో అర్బన్‌ ఓటర్లు ఎక్కువగా ఉండే న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో మాత్రం డెమొక్రాటిక్‌ పార్టీకి తిరుగులేని విజయం లభిస్తుంది. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఫలితాలు త్వరగా రావడంతో తొలుత బైడెన్‌‌ ఆధిపత్యం కనిపించింది. ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో ఫలితాలు నెమ్మదిగా వస్తుండటంతో ఆయన ఆధిపత్యం కొంత తక్కువగా ఉంది. స్వింగ్‌ స్టేట్స్‌లో ఇప్పుడున్న పరిస్థితే చివరి వరకు కొనసాగితే ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.