Boxer Lovlina Borgohain : కరోనాను జయించి ఒలింపిక్స్ పతకం దిశగా.. అరంగేట్రంలోనే అదరగొట్టేసిన బాక్సింగ్ సంచలనం లవ్లీనా ప్రస్థానం

టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది.

10TV Telugu News

Boxer Lovlina Borgohain : టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో చైనా తైపీకి చెందిన బాక్సర్ చెన్ నియెన్-చిన్ మీద 4-1 తేడాతో విజయం సాధించిన లవ్లీనా ఒలింపిక్ పతకం కలను నెరవేర్చుకుంది.

ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో సంచలనం సృష్టించిన 23ఏళ్ల యువ బాక్సర్‌ లవ్లీనా అరంగేట్ర పోటీల్లోనే పతకాన్ని ముద్దాడబోతోంది. కాగా, పోటీలకు ముందు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడి కొంతకాలం పాటు శిక్షణకు దూరమైన ఆమె.. ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

కిక్‌ బాక్సింగ్‌ నుంచి..
అస్సాంలోని గోలాఘాట్‌ జిల్లా బారో ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్ 2న జన్మించింది లవ్లీనా. తండ్రి చిరు వ్యాపారి. ఆమె కంటే పెద్దవారైన ఇద్దరు కవల సోదరీమణులు కిక్‌ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అక్కలను చూసి తను కూడా ముందు కిక్‌ బాక్సింగ్‌ను ఎంచుకుంది. జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొంది. ఒక రోజు స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమె చదువుతున్న హైస్కూల్లో పోటీలు నిర్వహించింది. అందులో లవ్లీనా కూడా పోటీ చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్‌ పదుమ్‌ బోరో ఆమెను కిక్‌ బాక్సింగ్‌ నుంచి బాక్సింగ్‌కు పరిచయం చేశారు. అలా 2012 నుంచి ఆమె బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది.

రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌..
2017లో జరిగిన ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడంతో లవ్లీనా పేరు బాక్సింగ్‌ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 2018లో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ ఏడాది ఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అరంగేట్రం చేసిన లవ్లీనా.. 69కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ మరుసటి ఏడాదే రష్యాలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో మళ్లీ కాంస్యపతకం సాధించింది. అంతేగాక ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్యాలు దక్కించుకుంది.

కరోనాను ఎదిరించి..
2020 మార్చిలో జరిగిన ఆసియా అండ్‌ ఓషినియా బాక్సింగ్‌ ఒలింపిక్‌ అర్హత టోర్నమెంట్‌లో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌ 2020లో లవ్లీనా బెర్తు ఖరారు చేసుకుంది. గతేడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో లవ్లీనా తల్లి మమోనీ బొర్గోహెన్‌కు కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో తల్లిని చూసేందుకు స్వస్థలానికి వెళ్లిన లవ్లీనా కరోనా బారిన పడింది. దీంతో ఒలింపిక్స్‌లో అర్హత సాధించిన 16 బాక్సర్లకు సాయ్‌ కేటాయించిన 56 రోజుల యూరప్‌ శిక్షణ టూర్‌కు ఆమె వెళ్లలేకపోయింది.

కరోనా సోకిన సమయంలో లవ్లీనా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. ‘‘కొవిడ్‌ బారిన పడిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా. సాధన చేసేందుకు కూడా నా ఆరోగ్యం సహకరించ లేదు. అయినా కుంగిపోలేదు. సానుకూల దృక్పథంతో ఉన్నా. మెడిటేషన్‌ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకున్నా. భవిష్యత్‌ అవకాశాలపై దృష్టిపెట్టా’’ అని లవ్లీనా చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వేగంగా శిక్షణ మొదలుపెట్టింది.

అరంగేట్రమే అయినా..
లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారి. అయినా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్‌ వరకు చేరింది. క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌, చైనీస్‌ తైపీ బాక్సర్‌ నిన్‌-చిన్‌తో తలపడింది. దూకుడు ప్రదర్శించకుండా తెలివిగా పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థిని కట్టడి చేసింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఆగస్టు 4న జరిగే సెమీస్‌లో నెగ్గితే రజతం లేదా స్వర్ణ పతకం సాధిస్తుంది. ఒకవేళ అక్కడ ఓడిపోయినా కనీసం కాంస్యం దక్కుతుంది.

10TV Telugu News