Ravi Kumar Dahiya : అక్కడ దారుణంగా కొరికాడు, అయినా తగ్గలేదు.. భారతీయులు గర్వపడేలా చేసిన రెజ్లర్

ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా పోరాటం భారతీయులు గర్వపడేలా చేస్తోంది. సెమీ ఫైనల్ లో ఓడిపోతాడు అనుకున్న దశలో అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. ఒకానొక దశలో ప్రత్యర్థి సనయేవ్ నురిస్లామ్.. దహియా

Ravi Kumar Dahiya : అక్కడ దారుణంగా కొరికాడు, అయినా తగ్గలేదు.. భారతీయులు గర్వపడేలా చేసిన రెజ్లర్

Ravi Kumar Dahiya

Ravi Kumar Dahiya : ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా పోరాటం భారతీయులు గర్వపడేలా చేస్తోంది. సెమీ ఫైనల్ లో ఓడిపోతాడు అనుకున్న దశలో అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. ఒకానొక దశలో ప్రత్యర్థి సనయేవ్ నురిస్లామ్.. దహియా భుజాన్ని దారుణంగా కొరికేశాడు. అయినా మన కుస్తీ వీరుడు వెనక్కి తగ్గలేదు. అదే సమయానికి నురిస్లామ్ గాయపడ్డాడు. ఇదే అదనుగా అతడిని 30 సెకన్ల పాటు లేవకుండా చేసి గెలిచాడు దహియా. భారత్ తరఫున రెజ్లింగ్ ఫైనల్ చేరిన రెండో ఆటగాడు దహియానే.

భారత రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కుస్తీ పోటీ సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. సెమీ ఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్‌ను ఓడించిన రవికుమార్ భారత్‌కు పతకం ఖాయం చేశాడు. ఇక ఫైనల్లో గెలిస్తే గోల్డ్ లేదంటే సిల్వర్ మెడల్ ఖాయంగా వస్తుంది.

‘బై ఫాల్‌’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్‌ రెజ్లర్‌ సనయేవ్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్‌ రవి చేతిని దారుణంగా కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు.

గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా… ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి… మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చరిత్రలో స్వర్ణ-రజత ఫైనల్‌ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు.

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జవూర్‌ ఉగుయెవ్‌తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే… షూటర్‌ అభినవ్‌ బింద్రా (2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.

భారత రెజ్లింగ్‌ అంటే ఇన్నాళ్లూ సుశీల్‌ కుమార్, యోగేశ్వర్‌ దత్, బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్‌ పేర్లే టక్కున గుర్తుకొచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్‌ దీపక్‌ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా… మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా… ఆమెను ఓడించిన బెలారస్‌ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్‌ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది.