ఓడిపోయారని ఫిక్సా.. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్-జంప్

ఓడిపోయారని ఫిక్సా.. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్-జంప్

ఉత్కంఠభరితంగా తాడోపేడో అనే రీతిలో సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌(77)నే విజేతగా నిలిచారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైట్ హౌజ్ లోకి అధ్యక్ష పదవిలో అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డు సృష్టించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత జో బైడెన్‌ విజయం ఖరారు అయింది.

గోల్ఫ్‌ క్లబ్‌కు ట్రంప్‌
అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఆరోపణలు చేశారు. ఇక శనివారం నాటి ఫలితాలు తెలుసుకున్న ట్రంప్‌..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్‌. బుష్‌ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే.

బోసిపోయిన వైట్‌హౌస్‌
ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్‌ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్‌లను అభినందించారు.

వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్‌ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్‌ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్‌ ట్వీట్లను ట్విట్టర్‌ సంస్థ ఫ్లాగ్‌ చేసి చూపించింది.

పెన్సిల్వేనియాలో గెలుపు సాధించడంతో బైడెన్ కు మరో 20 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్‌ కాలేజీలోని 538ఓట్లకు మ్యాజిక్‌ ఫిగర్‌ 270 కాగా, 290 ఓట్లు బైడెన్ సొంతం చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక బైడెనే తదుపరి ప్రెసిడెంట్ అని సీఎన్‌ఎన్, వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి.

‘జోసెఫ్‌ ఆర్‌.బైడెన్‌ జూనియర్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్‌ హయాంలో వైట్‌ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఓటేసినా వేయకున్నా అందరి అమెరికన్లకు నేనే అధ్యక్షుడిని. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు.

‘ఈ ఎన్నికలు జో బైడెన్‌ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.