ట్రంప్‌పై అభిశంసనకు ఆమోదం

ట్రంప్‌పై అభిశంసనకు ఆమోదం

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. అధికార దుర్వినియోగం ఆరోపణలు వస్తుండటంతో ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఆయనపై ఈ తీర్మానాన్ని లేవనెత్తారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. సెనేట్‌లోనూ ఆమోదం పొందితే అభిశంసన ప్రక్రియ పూర్తయినట్లే. వచ్చే నెలలో ఎగువసభ అయిన సెనేట్‌లో ట్రంప్ విచారణను ఎదుర్కొనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దేశానికి ద్రోహం చేశాడంటూ ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ స్పష్టం చేసింది. ట్రంప్‌పె పెట్టిన రెండు అభిశంసన తీర్మానాలను ఆమోదింపజేసేందుకు చట్టసభ్యులు చర్చలో పాల్గొన్నారు. అంతకు ముందు అమెరికా ప్రతినిధుల సభ తనపై అభిశంసనకు తలపెట్టిన ప్రక్రియను ఆపేయమని డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. ఈ మేరకు డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు, హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి ఘాటుగా లేఖ రాశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డెమోక్రట్లు అభిశంసన జ్వరంతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

 

 

రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులను వినియోగించుకునేందుకు అడ్డు తగులుతున్నారని అన్నారు. ప్రజావేగు ఫోన్‌కాల్‌ అంశంపై ఆధారాలు సమర్పించేందుకు కూడా అవకాశమివ్వడమలేదని ట్రంప్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ‌తో జులై 25న ట్రంప్ మాట్లాడిన ఫోన్ కాల్ గురించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఓ అజ్ఞాత ఫిర్యాదు అందింది. ఆ తర్వాత వైట్ హౌస్ ఆ ఫోన్ సంభాషణ వివరాలను బయటపెట్టింది. 

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయబోయే జో బిడెన్, హంటర్ బిడెన్‌లపై విచారణలు చేపట్టాలంటూ జెలెన్స్కీని ట్రంప్ కోరినట్లు అందులో ఉంది. ఉక్రెయిన్‌కు సైనికపరమైన సాయాన్ని నిలుపుదల చేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఫోన్ సంభాషణ జరిగింది. బిడెన్‌పై విచారణ చేపడితేనే ఆ సాయాన్ని విడుదల చేస్తామని జెలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారని ఓ సీనియర్ అధికారి వాంగ్మూలం ఇచ్చారు. 

వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఓ ఉక్రెయిన్ గ్యాస్ సంస్థలో పనిచేశారు. జో బిడెన్, హంటర్ బిడెన్‌ల ప్రతిష్టను దెబ్బతీసేలా విచారణలు చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, ఇది చట్ట విరుద్ధమని డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపణలు.

అమెరికా చరిత్రలో ఇద్దరు అధ్యక్షులు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. 1868లో ఆండ్రూ జాన్సన్ సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు. 1998 బిల్ క్లింటన్‌ను సెనేట్ దోషిగా తేల్చకపోవడంతో పదవి కోల్పోలేదు. 1974లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్.. అభిశంసనకు ముందే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.