ట్రంప్ టూర్ : పాన్ షాపులు బంద్..రోడ్డుపై ఉమ్మి వేయవద్దు

  • Published By: madhu ,Published On : February 23, 2020 / 07:57 AM IST
ట్రంప్ టూర్ : పాన్ షాపులు బంద్..రోడ్డుపై ఉమ్మి వేయవద్దు

అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ట్రంప్ ఇండియా రానున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌నకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఆగ్రాలో కూడా యుద్ధప్రాతిపదికన సుందరీకరణ పనులు చేస్తున్నారు. ట్రంప్ కు భారత పర్యటన గుర్తుండిపోయేలా.. ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం, మంగళవారం ట్రంప్ తన భార్య మెలానియా, కూతరు ఇవాంకా, అల్లుడు జరీద్ కుష్నర్‌తో కలిసి భారత్‌లో పర్యటిస్తారు.
పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో 22 కిలోమీటర్ల మేర ట్రంప్, మోదీ రోడ్ షో జరగనుంది.

మూడు గంటలపాటు జరిగే ఈ పర్యటన కోసం కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యం ఇవ్వడంలో బడ్జెట్ గురించి ఆలోచించవద్దని గుజరాత్ సీఎం రూపానీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రోడ్ షో పొడవునా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులతో కనిపించనున్నారు. 

ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ లో పాన్ షాపులను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఎవ్వరూ పాన్ నమిలి ఊయకుండా, గోడలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్-మోడీ రోడ్ షో మార్గంలో ట్రంప్ కు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గడను కూడా నిర్మించారు. మరోవైపు పలు విమాన సర్వీసలును రీ షెడ్యూల్ చేయడం, విమానాలను దారి మళ్లించడం చేస్తున్నారు. దాదాపు 60 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రీ షెడ్యూల్ చేశారు. వీధి కుక్కలను ఎక్కడికక్కడ పట్టుకుని బంధించారు అధికారులు.

ఇక ట్రంప్ రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆగ్రా వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దుతున్నారు. అయితే తాజ్ వెనుక భాగంలో ప్రవహించే యమునా నదిలో నీళ్లు లేక, జంతువులు తిరుగుతూ కొంచెం దుర్వాసన వస్తున్న సమయంలో.. ట్రంప్ రాకతో  యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. మొత్తానికి అగ్రరాజ్య అధినేత ట్రంప్ కు భారత్ పర్యటన చిరకాలం గుర్తుండిపోయేలా భారీ ఏర్పాట్లు చేశారు.