గత 15 ఏళ్లలో 10ఏళ్ళు ఆదాయపు పన్ను కట్టని ట్రంప్!

  • Published By: venkaiahnaidu ,Published On : September 28, 2020 / 03:22 PM IST
గత 15 ఏళ్లలో 10ఏళ్ళు ఆదాయపు పన్ను కట్టని ట్రంప్!

Donald Trump:అమెరికా అధ్యక్షుడు‌ ట్రంప్‌ కొన్నేళ్లుగా ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని రాసింది. గ‌త రెండు ద‌శాబ్ధాల‌కు చెందిన ట్రంప్ ఆదాయ‌ప‌న్ను వివ‌రాల‌ను పత్రిక సేక‌రించింది. గ‌డిచిన 15 ఏళ్ల‌లో అమెరికా అధ్య‌క్షుడు సుమారు ప‌దేళ్లు ఎటువంటి ప‌న్ను క‌ట్ట‌లేద‌ని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

అధ్య‌క్షుడిగా ఎన్నికైన 2016 సంవ‌త్స‌రంలో ట్రంప్ కేవ‌లం 750 డాల‌ర్లు మాత్ర‌మే ఆదాయంప‌న్నుగా చెల్లించిన‌ట్లు తేలింది. ఆ త‌ర్వాత ఏడాది కూడా అధ్య‌క్షుడు ట్రంప్ అంతే మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో చెల్లించిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. తనకు ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ వచ్చినందున ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన ఆ శాఖకు వివరణ కూడా ఇచ్చుకున్నారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో తెలిపింది.


అయితే, పదేళ్లపాటు ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి తనపై వచ్చిన మీడియా కథనాలపై ట్రంప్ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని స్పష్టం చేశారు. నిజానికి తాను పన్నులు కట్టానని ట్రంప్ తెలిపారు. పన్ను రిటర్నులు ప్రస్తుతం ఆడిట్​ లో ఉన్నాయన్నారు . అవి పూర్తి కాగానే మీకే నిజాలు తెలుస్తాయి. న్యూయార్క్ టైమ్స్ కొన్ని కల్పితాలను సృష్టించాలని భావిస్తోంది. వాళ్లు చేయాలనుకున్నది చేస్తున్నారు అని ట్రంప్ తెలిపారు.


మరోవైపు, 1970 నుంచి ఆదాయ‌ప‌న్ను వివ‌రాల‌ను వెల్ల‌డించని తొలి అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే 1970 రిచర్డ్‌ నిక్సన్, ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. మిగతా అధ్యక్షులందరు వెల్లిడిస్తూ వచ్చారు. తాను కిమిషనర్‌ ఆధ్వర్యంలో ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆడిట్‌ పరిధిలో ఉన్నందున తాను ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ప్రజలకు వెల్లడించలేనని కూడా ట్రంప్‌ చెప్పుకున్నారు.