G-7లోకి ఇండియాని రప్పించేందుకు ట్రంప్ ప్లాన్

  • Published By: vamsi ,Published On : May 31, 2020 / 06:16 AM IST
G-7లోకి ఇండియాని రప్పించేందుకు ట్రంప్ ప్లాన్

ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల గ్రూపులోకి ఇండియాతో పాటు మరికొన్ని దేశాలను చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేశారు. “కాలం చెల్లిన” గ్రూప్ ఆఫ్ సెవెన్ శిఖరాగ్ర సమావేశాన్ని సెప్టెంబర్ వరకు వాయిదా వేస్తున్నానని ప్రకటించిన ట్రంప్.. రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మరియు ఇండియాలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రాతినిధ్యం వహించే జీ-7ను మరింత విస్తరించాలని, భవిష్యత్తులో చైనాను ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి ఇది సరైన సమయం అని, అందుకే సాంప్రదాయ మిత్రులను కలిసి తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాలు జీ-7లో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్ , యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడా దేశాలు అందులో ఉన్నాయి. ఈ ఏడాది జీ-7 అధ్యక్ష పదవిని అమెరికా కలిగి ఉండగా.. జూన్‌ 12న అమెరికాలో జీ-7 సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ట్రంప్ ప్రకటనతో ఆ సమావేశం వాయిదా పడినట్లుగా అయ్యింది. ఇదే సమయంలో ప్రపంచంలో ప్రస్తుతం చోటు చేసుకుంటోన్న పరిణామాలపై జీ-7 సరిగ్గా స్పందించట్లేదని ట్రంప్ కామెంట్ చేశారు.