కమలా హారిస్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 12, 2020 / 06:57 PM IST
కమలా హారిస్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జో బిడెన్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం… భారతీయ ఓట్లన్నిటిని ప్రభావితం చేసే అవకాశం ఉందని ట్రంప్ కి అర్థమైంది. కానీ ఇపుడు దానికి విరుగుడు ట్రంప్ చేతిలో ఏం లేదు. దీంతో అతను కమల హ్యారిస్ పై తన నోటిదురుసును ప్రదర్శించారు.

భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్ ఓ భయంకరమైన మహిళ అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.యూఎస్ సెనేట్ లో కమలా హారిస్ కు మర్యాదే లేదని, ఆమె ‘హారిబుల్’ సభ్యురాలని ఆరోపించారు. డెమొక్రాట్ నామినేషన్ కోసం ఆమె ప్రయత్నిస్తున్న తీరు తనను ఇంప్రెస్ చేయలేదని, ప్రైమరీల్లో ఆమెకు పేలవమైన స్పందన లభించిందని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాంటి మహిళను జో బిడెన్ ఎన్నుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ అక్కడితో ఆగలేదు. సెనేట్ గౌరవానికి ఏ మాత్రం సరితూగని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హ్యారిస్ మాత్రమే అని ట్రంప్ తన అక్కసు చాటుకున్నారు. జాత్యహంకార విధానాలకు జో బిడెన్ మద్దతు ఇస్తున్నారని ట్రంప్ఆరోపించడం కొసమెరుపు. ఎందుకంటే ట్రంప్ శ్వేతజాతి విధానాలు రిపబ్లికన్ల వర్ణ వివక్ష అందరికీ తెలిసిందే.

కాగా-ఆమె ఎంపిక చరిత్రాత్మకమని, తొలి నల్లజాతి మహిళ, మొట్టమొదటి ఏషియన్ అమెరికన్ వుమన్ కూడా అయిన కమలా హారిస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించగలరని ఆశిస్తున్నానని జో బిడెన్ అన్నారు. దేశంలో వర్ణ వివక్ష, జాత్యహంకారం పెట్రేగుతున్న ఈ తరుణంలో ఈమె సెలెక్షన్ మంచి మార్పునకు దారి తీస్తుందన్నారు.

భారతీయ, జమైకా ఇమిగ్రెంట్ దంపతుల కూతురైన కమలా హారిస్ లోగడ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. దివంగతుడై న జోబిడెన్ కుమారునితో గతంలో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నారు. అది కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపిందని జో బిడెన్ అంటున్నారు. అమెరికాలో అత్యధికుల మెప్పు పొందిన అధ్యక్షుడు బరాక్ ఒబామా… హ్యారిస్ గొప్ప మహిళ అంటూ కితాబు ఇచ్చారు. ఇది రిపబ్లికన్స్ కి ఏమాత్రం మింగుడపడటం లేదు.