భారత్-పాక్‌ల వివాదం సద్దుమణుగుతోంది: ట్రంప్

భారత్-పాక్‌ల వివాదం సద్దుమణుగుతోంది: ట్రంప్

రెండు రోజులుగా భారత్-పాక్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడితో బీజం పడిన దాడులు.. ప్రతిదాడులు విషయంలో కాస్త వాడీవేడిగానే జరిగాయి. ఈ క్రమంలో భారత సైనికులకు తోడుగా నిలిచిన ఎయిర్ ఫోర్స్ బలగాలు పాక్ దేశంలో ఉగ్రవాద శిక్షణా క్యాంపులపై విరుచుకుపడ్డాయి. వెయ్యి కేజీల బాంబులతో లైన్ ఆఫ్ కంట్రోల్ ను నాశనం చేశాయి. 

ప్రపంచ దేశాలన్నీ ఈ విషయాలను గమనిస్తూ స్పందిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పాక్ దేశానికి అగ్రరాజ్యమైన అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటుగా బుధవారం కిమ్-ట్రంప్‌ల భేటీ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మరో సారి భారత్-పాక్‌ల విషయంపై ట్రంప్ స్పందించారు. 

హనోయ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్-పాక్‌లు సహేతుక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. హుందాతనంగా వ్యవహరాన్ని చక్కదిద్దుకోవాలని భావిస్తున్నా. దాదాపు వివాదం సద్దుమణిగినట్లేనని అనిపిస్తోంది’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.