నేను మళ్లీ వస్తా.. అసలు ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందన్న ట్రంప్..!

నేను మళ్లీ వస్తా.. అసలు ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందన్న ట్రంప్..!

Trump vows comeback after second Senate acquittal : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన నుంచి గట్టెక్కారు. కేపిటల్ భవనంపై దాడి​ ఘటనకు సంబంధించి రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో ట్రంప్‌‌ను నిర్దోషిగా ప్రకటించారు. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం వీగిపోయింది. తనకు అనుకూలంగా ఓటు వేసిన సెనేట్‌లో తన రక్షణ బృందానికి, మద్దతుదారులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి అసలు ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం.. దేశ చరిత్రలోనే మరో అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. త్వరలో అమెరికన్ భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం ద్వారా మళ్లీ కలుద్దామని అన్నారు. సత్యాన్ని, న్యాయాన్ని సమర్ధిస్తూ తనకోసం పనిచేసిన మద్దతుదారులకు ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెుత్తం 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు అనుకూలంగా 57 మంది ఓటువేశారు. అలాగే ఆయనకు వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. అభిశంసన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది.

ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు సైతం ట్రంప్‌ను అభిశంసించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ట్రంప్ అభిశంసనానికి అవసరమైన 67 ఓట్లు రాలేదు. అమెరికాలో అధ్యక్షుల చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్‌ మిగిలిపోయారు. అమెరికాను గొప్పగా మార్చడానికి చారిత్రాత్మక, దేశభక్తితో పాటు అసలైన రాజకీయం ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మళ్లీ తిరిగి వస్తానని అన్నారు.

రాబోయే నెలల్లో మీతో తాను చాలా పంచుకోవలసి ఉందన్నారు. ప్రజలందరికీ అమెరికన్ గొప్పతనాన్ని సాధించడానికి అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పిలుపునిచ్చారు. ఆ సమయం కోసమే తాను ఎదురుచూస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.