గాడిదలకు ప్రభుత్వ ఉద్యోగాలు..!! ఎక్కడంటే..

  • Published By: Chandu 10tv ,Published On : November 16, 2020 / 12:48 PM IST
గాడిదలకు ప్రభుత్వ ఉద్యోగాలు..!! ఎక్కడంటే..

turkey Donkeys working as garbage collectors : పూర్వం వ్యాపారులు వస్తువులను మోయడానికి గాడిదలను ఉపయోగించేవారు. రజకులు బట్టల్ని గాడిదలపై తీసుకెళ్లేవారు. తమ వస్తువులను ఒక చోటినుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు వ్యాపారస్ధులు గాడిదలను ఉపయోగించేవారు. కానీ కాలం మారిపోయింది. వస్తువుల తరలింపు చాలా ఈజీగా జరిగిపోతోంది. చిన్నపాటి వాహనాల నుంచి పెద్ద పెద్ద కంటైనర్లలో సరుకులు ట్రాన్స్ పోర్టేషన్ జరుగుతోంది. దీంతో గాడిదల వినియోగం ఇంచుమించు తగ్గిపోయింది.

పట్టణాల్లో చూద్దామన్న గాడిదలు అసలు కనిపించటం లేదు. కానీ, గాడిద పాలతో అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చననే వార్తల్ని చూస్తున్నాం. దీంతో కొంతమంది గాడిదల్ని పెంచుతున్నారు. అది ఉపాధి కోసం. కానీ సరుకుల తరలింపుకాదు. కానీ టర్కీలోని ఓ పట్టణంలో గాడిదలు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నాయి. మనుషులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకటం గగనమైపోతున్న ఈరోజుల్లో గాడిదలేంటీ ప్రభుత్వ ఉద్యోగాలు చేయటమేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ..నిజమే కాలం ఏరకంగా మారుతుందో ఎవ్వరూ చెప్పలేం. దానికి ఉదాహరణే గాడిదలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయటం. టర్కీలోని ఓ మున్సిపాలిటీలో గాడిదలు ఉద్యోగాలు చేస్తున్నాయి.



వివరాల్లోకి వెళ్తే…. టర్కీలోని మార్డిన్‌ ప్రావిన్స్‌లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఆ ప్రాంతంలో కొన్నేళ్లుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరించటంలో మున్సిపాలిటీ ఉద్యోగులకు సహాయపడుతున్నాయి. అర్తుక్లులో చాలావరకు ఇళ్లు ఇరుకు వీధుల్లోనే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల చెత్త సేకరించే మున్సిపాల్ వాహనాలు ఆ వీధుల్లోకి వెళ్లలేని పరిస్ధితి. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులు ఈ గాడిదలను చెత్త సేకరణకు ఉపయోగించుకోవాలన్ని నిర్ణయించుకున్నారు.



సాధారణంగానే గాడిదలు బరువు మోయడానికే ఉపయోగపడతాయి. కానీ వీరు మాత్రం సుమారుగా 40 గాడిదలను చెత్త సేకరించే ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఒక్కో గాడిద వెంట ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉంటాడు. అతడు చెత్తను తీసుకొని గాడిదపై ఉండే చెత్తసంచుల్లో వేస్తారు. అలా వీధులన్నీ తిరుగుతూ ఇళ్ల ముందు, రోడ్డులపై ఉండే చెత్తను గాడిద మోసుకెళ్లి డంపింగ్‌యార్డ్‌లో పడేస్తుంది.




https://10tv.in/these-pictures-need-no-caption-crying-face-izmir-and-all-of-turkey-is-in-pain/
అంతేకాదు ఈ గాడిదలు ప్రభుత్వ ఉద్యోగుల లాగానే రోజుకు ఆరు గంటలు పనిచేస్తాయి. ఇవి షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తాయి. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు విధులన్ని నిర్వర్తిస్తాయి. పనిపూరైన తర్వాత మున్సిపాలిటీ కేటాయించిన ప్రాంతంలో సేదతీరుతాయి. ఇలా ఒక్కో గాడిద సుమారు ఏడేళ్లపాటు పనిచేసి రిటైర్‌ అవుతుంది. అలా రిటైర్ అయిన గాడిదలకు ప్రభుత్వమే ఆశ్రయం కల్పిస్తుంది. ఇలా డిసెంబర్ 2017లో మూడు గాడిదలు రిటైర్‌ అయినప్పుడు ప్రభుత్వం వాటిని ఘనంగా సన్మానించింది. అప్పుడు ఉద్యోగులు వాటికి ఆహారంగా పండ్లు, కూరగాయాలను తెచ్చి ఇచ్చారు.