అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు…ప్రతి 33సెకండ్లకు ఒకరు మృతి

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు…ప్రతి  33సెకండ్లకు ఒకరు మృతి

U.S. loses one life every 33 seconds to COVID-19       గత వారం అమెరికాలో ప్రతి 33 సెకండ్లకు ఒక కరోనా మరణం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత వారంలో మొత్తంగా 18,000కు పైగా కోవిడ్ మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. అంతుకుందు వారంకంటే రికార్డు స్థాయిలో గతవారం 6.7శాతం కోవిడ్ మరణాలు పెరిగాయని ఓ రిపోర్ట్ పేర్కొంది. అయితే,గత వారం కొత్త కరోనా కేసుల్లో 1శాతం తగ్గుదల కనిపించినట్లు తెలిపింది.

దాదాపు 15లక్షల కొత్త కరోనా కేసులు గత వారం అమెరికాలో నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం కేసులు కాలిఫోర్నియా,టెన్నిసీ,రోఢీ ఐల్యాండ్ లో నమోదయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. మరణాల విషయానికొస్తే…సౌత్ డకోటా,రోఢీ ఐల్యాండ్,లోవాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

అమెరికా వ్యాప్తంగా గత వారం మొత్తం టెస్ట్ లలో… 11.3శాతం వైరస్ కి పాజిటివ్ గా రాగా, అంతకుముందు వారం ఇది 12శాతంగా ఉంది. యూఎస్ లోని మొత్తం 50 రాష్ట్రాల్లో… 31 రాష్ట్రాలు 10శాతం..అంతకన్నా ఎక్కువ పాజిటివ్ టెస్ట్ రేటు కలిగి ఉంది. లోవా,ఇడాహోలో అయితే అత్యధికంగా 40శాతానికి పైగా పాజిటివ్ టెస్ట్ రేటు ఉంది.

అయితే, క్రిస్మస్,న్యూ ఇయర్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిమూటం వంటివి జరిగితే కరోనా కేసులు ఇంకా భారీగా పెరుగుతాయని,హాస్పిటల్స్ పేషెంట్లతో నిండిపోవచ్చునని హెల్త్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హెల్త్ అధికారులు ఎన్నిరకాలుగా విజ్ణప్తి చేసినా వాటిని పట్టించుకోని ప్రజలు కరోనా బారినపడుతున్నారు.

గత శుక్రవారం,శనివారం,ఆదివారం రోజుల్లో అమెరికా ఎయిర్ పోర్టుల్లో 32లక్షల మందికి స్క్రీనింగ్ చేశారంటే అక్కడి ప్రజలు ఇంకా ప్రభుత్వ సూచనలను పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు.  క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జోబైడెన్‌ మరోసారి అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.

కాగా,అమెరికాలో ఇప్పటికే ఫైజర్ కంపెనీ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు.

సోమవారం అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కరోనా టీకా వేయించుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో బైడెన్‌ (78) ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్‌ వ్యాక్సినేషన్ వేయించుకోవడాన్ని టీవీల్లో ప్రత్యక్షప్రసారం చేశారు. వ్యాక్సిన్ సురక్షితంపై ఆందోళన చెందుతున్న ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తొలి డోస్ వేయించుకున్నట్లు బైడెన్ చెప్పారు. బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ కూడా ముందు రోజే టీకా వేయించుకున్నారు.

కాగా,అమెరికాలో ఇప్పటివరకు 1కోటి 82లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 3లక్షల 22వేల మరణాలు నమోదయ్యాయి.