UAE Flooded: యూఏఈలో భారీగా వరదలు.. గుంతల్లో కూరుకుపోయిన కార్లు.. వీడియో వైరల్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విటర్ లో వైరల్ గా మారాయి..

UAE Flooded: యూఏఈలో భారీగా వరదలు.. గుంతల్లో కూరుకుపోయిన కార్లు.. వీడియో వైరల్

Flood

UAE Flooded: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. షార్జా, పుజైరా లోని పలు ప్రాంతాల్లో ప్రజలను స్థానిక పోలీసులు రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో రెండు నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పుజైరా పర్వత భూభాగంలో, లోయల కారణంగా భారీగా వరదలు వచ్చాయి. ట్విటర్ లోని వీడియోల్లో ఫుజైరా వీధుల్లో పార్క్ చేసిన కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కల్బా మార్కెట్‌లోని ఖాళీ దుకాణాలలోకి వరద నీరు ప్రవేశించడం వీడియోలో కనిపిస్తుంది.

వరదల కారణంగా నగరం ప్రవేశ ద్వారం వద్ద రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు నిండిన రోడ్డుపై కార్లు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో చాలాచోట్ల వరదల కారణంగా రోడ్లు కోతకు గురైనట్లు వీడియోలో చూడొచ్చు. ఖలీజ్ టైమ్స్ ప్రకారం.. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా యూఏఈ తూర్పు భాగాలలో ఆకస్మిక వరదలతో ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సైనికులు రంగంలోకి దిగారు. ప్రమాదకర వాతావరణ సంఘటనల దృష్ట్యా ఎమిరేట్ వాతావరణ విభాగం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది రోజులలో మేఘావృతమైన పరిస్థితులు కొనసాగుతాయని, వర్షాలు తూర్పు వైపుగా కురుస్తాయని, కొన్ని అంతర్గత, దక్షిణ ప్రాంతాలకు భారీ వర్షాలు విస్తరించొచ్చని పేర్కొంది.

ఈ భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా 900 మందిని రక్షణ సిబ్బంది కాపాడినట్లు ఓ నివేదిక తెలిపింది. అంతేకాక 3,897 మందిని షార్జా, పుజైరాలో తాత్కాలిక ఆశ్రయంలో ఉంచామని, వారి నివాస ప్రాంతాల్లో మామూలు పరిస్థితులు వచ్చే వరకు వారు ఇక్కడే ఉంటారని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఎమిరేట్స్‌లో భారీ వర్షాలు కురవడానికి వాతావరణ మార్పులే కారణమని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.