స్వచ్ఛమైన ‘‘గాలి’’..లీటరు రూ.5వేలు!!

స్వచ్ఛమైన ‘‘గాలి’’..లీటరు రూ.5వేలు!!

UK : bottles of fresh air from sale for 25 pounds each: అమ్మాకానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా అన్ని అమ్మేస్తున్నారు. కానీ ఇప్పుడు ‘గాలి’ని కూడా అమ్మేస్తున్నారు. అదేంటీ గాలి కంటికి కనిపించదు. చేతికి దొరకదు మరి గాలిని ఎలా అమ్ముతారనే కదా మీ డౌటనుమానం..!! నిజమే. గాలిని సీసాల్లోకి పట్టి అమ్ముతున్నారు. యూకేలోని దేశాల్లో ‘గాలి’ని సీసాల్లోకి పట్టి అమ్ముతున్నారు. మై బ్యాగేజ్ (My Baggage) అనే సంస్థ ఈ ’గాలి’వ్యాపారం చేస్తోంది. యూకేలోని ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్,వేల్స్ దేశాల్లోని స్వచ్చమైన గాలిని వ్యాపారం చేస్తున్నారు. అరలీటర్ ‘గాలి బాటిల్’ 25 పౌండ్లు చొప్పున అమ్ముతున్నారు. అంటే మన భారత కరెన్సీలో రూ.2500. అంటే లీటర్ గాలి రూ.5వేలు..!! ఇది ఏప్రిల్ ఫూల్ మాత్రం కాదండోయ్. నిజ్జంగా నిజం.

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ అల్లకల్లోలం రేపుతోంది. సాధారణ కోవిడ్-19 కంటే ఈ కొత్తరకం వైరస్ 75శాతం అధికంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వెంటనే అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌తో లింక్‌లు కట్ చేశాయి. యూకే నుంచి పలు దేశాలకు సాగించే రాకపోకలు విమానాలపై నిషేధం విధించాయి.

ఈ క్రమంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులు క్రిస్మస్‌ పండగ కోసం వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక్కసారైనా క్రిస్మస్ కు వచ్చి వారి వారి సొంతప్రాంతాల గాలిని మనసారా ఆస్వాదించాలనుకునే వారి ఆశ ఈ వైరస్ ల పుణ్యమాని నెరవేరటంలేదు.

అటువంటి ఆశావహులకు ‘మై బ్యాగేజ్’ అనే సంస్థ ఈ శుభవార్త తెలిపింది. బ్రిటన్‌లో ఉండే స్వచ్ఛమైన గాలిని ప్రపంచదేశాల్లో ఉన్న బ్రిటన్ వాసులకు అందిస్తామంటూ ప్రకటించింది. నచ్చిన ప్రాంతాల నుంచి గాలిని సేకరించి.. దాన్ని బాటిల్స్‌లో నింపి.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పంపిస్తామని ప్రకటించింది.

మై బ్యాగేజ్ (My Baggage) సంస్థ ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్ నుంచి స్వచ్ఛమైన గాలిని సేకరిస్తోంది. ఈ స్వచ్ఛమైన గాలిని బాటిల్స్‌లో నింపి అమ్మకాలు చేపట్టింది. 500 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిల్స్ లభిస్తాయి. బాటిల్స్ కార్క్ ఓపెన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛమైన గాలిని, అందులోని పరిమళాన్ని ఆస్వాదించవచ్చట.

కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు.. అందులో పలు రకాల ఫ్లేవర్స్ కూడా అందిస్తోంది మై బ్యాగేజ్. చేపల వాసన, చిప్స్ వాసన, పంట పొలాల పరిమళాలు.. ఇలా ఏది కోరితే ఆ అరోమాను నింపి అందజేస్తారు. ఇంటిపై బెంగ (Homesickness) పెట్టుకున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బాటిల్స్‌ను అమ్ముతున్నారు. ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిల్స్ ధర 500 ml బాటిల్‌ 25 పౌండ్లకు అమ్ముతున్నారు. అంటే భారత కరెన్సీలో రూ.2వేల 494. అదే లీటర్ ఫ్రెష్ ఎయిర్ కావాలంటే 50 పౌండ్లు అంటే దాదాపు రూ.5వేలు చెల్లించాల్సిందే.

కాగా..బాటిల్స్‌లో ఫ్రెష్ ఎయిర్ అమ్మడం ఇదే తొలిసారి కాదు. స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌బ్రీజ్ కంపెనీ 2018 నుంచి స్విస్ పర్వత ప్రాంతాల్లోని గాలిని బాటిల్స్‌లో నింపి అమ్ముతోంది. ఇక కెనడాకు చెందిన విటాలిటీ ఎయిర్ కంపెనీ రాకీ పర్వతాల నుంచి గాలిని సేకరించి చైనాకు అమ్మకాలు జరుపుతోంది. రెండు 8 లీటర్ల బాటిల్ ప్యాకెట్‌ను 52.99 డాలర్లు (దాదాపు రూ.4వేలు)లకు విక్రయిస్తున్నారు. అదే గాలిని స్విస్‌బ్రీజ్ కంపెనీ 20 డాలర్లు (దాదాపు రూ.1500)లకు అమ్ముతోంది.