శతాబ్దం తర్వాత…డిసెంబర్ 12న బ్రిటన్ ఎన్నికలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2019 / 04:15 AM IST
శతాబ్దం తర్వాత…డిసెంబర్ 12న బ్రిటన్ ఎన్నికలు

బ్రెగ్జిట్ ప్రతిష్ఠంభనను తొలగించే లక్ష్యంతో డిసెంబర్‌ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మంగళవారం(అక్టోబర్-29,2019) బ్రిటన్ పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. 418 అనుకూల ఓట్లతో తీర్మాణం పాస్ అయింది.  20మంది ఎంపీలు వ్యతిరేకించారు. ఎన్నికల కోసం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంటు నుండి ఆమోదం పొందడంతో దాదాపు శతాబ్దం తర్వాత డిసెంబర్ లో మొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 1923 తర్వాత మొదటిసారి డిసెంబర్‌లో బ్రిటన్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో కలిసి గత ఐదేళ్లలో బ్రిటన్‌లో ఇది ఐదో సార్వత్రిక ఎన్నిక అవుతుంది. 

బ్రిటన్‌ లో సాధారణంగా చలికాలంలో ఎన్నికలు జరగవు. ప్రతికూల వాతావరణమే కారణం, డిసెంబర్‌లో ఇక్కడ చలి తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయి. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది. చలికాలం బ్రిటన్‌లో పగలు తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచే చీకట్లు అలుముకుంటాయి. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారుతుంది. ఆ సమయంలో ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిసెంబర్ 12న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చోటు దొరకడం కూడా కష్టం అవుతుంది. పెద్ద పెద్ద వేదికలన్నీ క్రిస్మస్, పెళ్లిళ్లు, పార్టీలకు ముందు నుంచే బుక్ అయిపోతాయి. అలాంటప్పుడు, పోలింగ్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సుంటుంది. ప్రజలను అక్కడి వరకూ తరలించడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవచ్చని కూడా అనుకుంటున్నారు. అంతే కాదు, ఆ సీజన్లో ఎన్నికలు ఎంపీలకు కూడా కష్టాలు తీసుకొస్తాయి. ఎందుకంటే తీవ్రమైన చలికాలంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం చాలా కష్టం.

బ్రెగ్జిట్ విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది, డిసెంబర్ 12న జరిగే ఎన్నికలు, దాని ఫలితాలపైనే ఆధారపడి ఉండనుంది. అక్టోబర్ 31నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తి చేస్తానన్న ప్రధాని బోరిస్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. దీంతో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షం దీనిని అస్త్రంగా మల్చుకునే అవకాశం ఉంది. జరగబోయే ఎలక్షన్స్ లో ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ మెజారిటీ సాధించగలిగితే..ఆయన తన షరతులపై యూరోపియన్ యూనియన్‌ నుంచి విడిపోతారు. వేరే పార్టీ గెలిచినా, లేదా వేరే ఎవరైనా ప్రధానమంత్రి అయినా బ్రెగ్జిట్ అంశంపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం సాధ్యం అవుతుంది. ‘నో డీల్ బ్రెగ్జిట్’ అంటే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే వచ్చే ఏడాది బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్‌ నుంచి బయటికి వస్తే, దానివల్ల బ్రిటన్ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని చాలా మంది ప్రజలు, వ్యాపారులు, ఎంపీలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ గడువును మూడోసారి యూరోపియన్ పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 31 వరకూ బ్రెగ్జిట్ గడువును  పొడిగించింది. జనవరి 31కి ముందు బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా ఒప్పందాన్ని ఆమోదిస్తే బ్రిటన్ ఈయూ నుంచి విడిపోవచ్చని చెప్పింది. 2016లో బ్రిటన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52 శాతం మంది బ్రెగ్జిట్‌ను సమర్థించారు. 48 శాతం మంది వ్యతిరేకించిన విషయం తెలిసిందే.