UN Chief : యూఎన్‌ చీఫ్ గా మళ్లీ ఆంటోనియా గుటెరస్‌!

యునైటెడ్ నేషన్స్(ఐక్యరాజ్యసమితి)ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్‌ భద్రతా మండలి మంగళవారం సిఫారసు చేసింది.

UN Chief : యూఎన్‌ చీఫ్ గా మళ్లీ ఆంటోనియా గుటెరస్‌!

Un Chief

UN Chief యునైటెడ్ నేషన్స్(ఐక్యరాజ్యసమితి)ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్‌ భద్రతా మండలి మంగళవారం సిఫారసు చేసింది. గతంలో పోర్చుగల్‌ ప్రధానిగా చేసిన గుటెరస్.. జనవరి-1,2017న యూఎన్‌ 9వ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్-31తో యుగియనుంది. దీంతో మరోసారి గుటెరస్ కే యూఎన్ సెక్రటరీ జనరల్ గా అవకాశం ఇవ్వాలని మంగళవారం జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ) ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే వరుసగా రెండోసారి..జనవరి 1,2022 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్‌ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్‌.. భద్రతామండలి తీర్మానాన్ని స్వాగతించింది.

కాగా,ఐరాస చీఫ్ పదవికి మరో 10 మంది పోటీ పడినప్పటికీ.. వారెవరికి ఐరాసలోని సభ్యదేశాల మద్దతు లేకపోవడం గమనార్హం. ఒక రకంగా గుటెరస్‌ ఎలాంటి పోటీ లేకుండానే రెండోసారి జనరల్‌ సెక్రటరీగా ఎన్నిక కానున్నారు. భద్రతా మండలి ఆమోదం లభించిందంటే ప్రతినిధుల సభ అంగీకారం లాంఛనప్రాయమే.

ఇక, ఐరాస చీఫ్ ఎన్నికపై ప్రకటన వెలువడటానికి ముందురోజు ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ బుధవారం ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. నాలుగింట మూడొంతుల ఓట్లతో విజయం సాధించారు. ఏటా జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్కో ప్రాంతానికి అవకాశం కల్పిస్తుంటారు. ఈసారి ఆసియా-పసిఫిక్ గ్రూప్ దేశాలకు అవకాశం దక్కగా, మాల్దీవులు దేశం తమ అభ్యర్థిగా అబ్దుల్ షాహిద్ ను ముందుంచగా, భారత్ సహా పలు దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి.