Joker Malware : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్.. జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు. ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది. ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది.

Joker Malware : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది

Joker Malware

Joker Malware : టెక్నాలజీ ఎంతగా యూజ్ అవుతుందో, అంతే స్థాయిలో మిస్ యూజ్ కూడా అవుతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యాప్ లు, సాఫ్ట్ వేర్ల విషయంలో. కొత్త కొత్త యాప్ లు, సాఫ్ట్ వేర్ లు ఎన్నో వస్తున్నాయి. యూజర్లకు బాగా ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాల్వేర్ లు విరుచుకుపడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లోని వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని తస్కరిస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్.. జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు. ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది. ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని విధాలుగా సమాచారాన్ని సేకరించి ఎక్కడో ఉన్న హ్యాకర్లకు పంపుతుంది.

కొంతకాలంగా ప్లే స్టోర్ లోని యాప్ లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న గూగుల్.. ఈ జోకర్ మాల్వేర్ ఉన్న యాప్ లను తొలగిస్తోంది. నాలుగేళ్ల కాలంలో 1800 యాప్ లను గూగుల్ తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ దీని ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. హ్యాకర్లు జోకర్ మాల్వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్తగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. దాంతో దీన్ని గుర్తించడం నిపుణులకు కష్టమవుతోంది. సాఫ్ట్ వేర్ల తరహాలో ఈ ప్రమాదకర మాల్వేర్ లోనూ కొత్త వెర్షన్లు తీసుకొస్తుండడంతో, వాటికి విరుగుడు రూపొందించడానికి సైబర్ నిపుణులకు ఎక్కువ సమయం పడుతోంది. ఈలోపే జోకర్ కొత్త వెర్షన్ విజృంభిస్తోంది.

తాజాగా, ప్లేస్టోర్ లోని కొన్ని యాప్ లపై ఓ మాల్వేర్ దాడి చేస్తున్నట్టు గుర్తించిన సైబర్ నిపుణులు, మరింత లోతుగా పరిశోధించగా ఇది కొత్త జోకర్ పనే అని తేలింది. ఇది కెమెరా, ఫొటో ఎడిటింగ్, ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్, వాల్ పేపర్, ట్రాన్స్ లేషన్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని, వాటి ద్వారా ఫోన్లలోకి ప్రవేశిస్తోందని గుర్తించారు.

ఇది ఓ యాప్ పై దాడి చేయగానే, మొదటి యాప్ కోడ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం లేకపోతే మాల్వేర్ ఎలాంటి ప్రభావం చూపదు. యాప్ లేటెస్ట్ వెర్షన్ సమాచారం ఉంటే మాత్రం ఫోన్ యూజర్ వివరాలన్నీ తస్కరిస్తుంది. అందుకే, యూజర్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లతో ఫోన్లను స్కాన్ చేస్తుండాలని, యాప్ స్టోర్లలో ఆయా యాప్ ల రేటింగ్ లను బట్టి కూడా వాటి భద్రతను అంచనా వేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జోకర్ ప్రీమియం బిల్లింగ్ ఫ్రాడ్ మాల్వేర్ సైతం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మాల్వేర్ కూడా అప్ డేటేడ్ ట్రిక్స్ తో గూగుల్ ప్లే స్టోర్ లో మళ్లీ వచ్చేసింది. 2017 నుంచి జోకర్ మాల్వేర్ ఉంది. ఇదో రకమైన బిల్గింగ్ ఫ్రాడ్. యూజర్ల ఫోన్లలో చొరబడి అవసరం లేని, ప్రీమియం సర్వీసులు యాక్టివేట్ చేస్తుంది. మొబైల్ బిల్లు వస్తే కానీ బాధితులకు అసలు విషయం అర్థం కాదు. తమ ప్రమేయం లేకుండానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.