ట్రంప్VS బైడెన్ : అమెరికా అధ్యక్ష ఫలితం ఆలస్యమవుతుందా?

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 08:48 AM IST
ట్రంప్VS బైడెన్ : అమెరికా అధ్యక్ష ఫలితం ఆలస్యమవుతుందా?

US election 2020: Why the poll results may be delayed అమెరికాకు కాబోయే అధ్యక్షుడెవరు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్న ఇదే. అయితే, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. కరోనా వేళ జరుగుతోన్న అతిపెద్ద ఎన్నికలు ఇవే.

చాలా రాష్ట్రాల్లో అక్కడి కాలమాన ప్రకారం నవంబర్​ 3న ఉదయం 6 గంటలకే (భారత కాలమాన ప్రకారం నవంబర్-​ 3 మధ్యాహ్నం 3.30 గంటలకు) పోలింగ్​ మొదలుకానుంది. న్యూయార్క్​, ఉత్తర డకోటా వంటి ప్రాంతాల్లో నవంబర్​ 3 రాత్రి 9 గంటలకు (భారత కాలమాన ప్రకారం నవంబర్​ 4 ఉదయం 6.30 గంటలకు) పోలింగ్​ పూర్తికానుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నవంబర్​ 3 రాత్రి 7 గంటలకే (భారత కాలమాన ప్రకారం నవంబర్​ 4 ఉదయం 4.30 గంటలకు) ఓటింగ్​ పూర్తవుతుంది.



అయితే, ఈసారి అమెరికా ఎన్నికల ఫలితం ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే తేలే అవకాశం లేదని తెలుస్తోంది. మెయిల్​ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా పెరగడం వల్ల వాటి లెక్కింపు అంత త్వరగా పూర్తయే సూచనలు కనిపించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉండటం కూడా ఇందుకు మరో కారణం.



సాధారణంగా పోలింగ్‌ రోజు ఓటింగ్‌ కేంద్రానికి రాలేనివారి కోసం మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ (పోస్టల్‌ లేదా ఆబ్సెంటీ ఓటింగ్‌) అవకాశాన్ని కల్పిస్తారు. సైన్యంలో పనిచేసేవారు, వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు దాన్ని ఉపయోగించుకుంటుంటారు. కానీ, ఈసారి కరోనా ముప్పు నేపథ్యంలో మెయిల్‌ బ్యాలెట్లను ఆశ్రయించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 50 శాతం ఓటర్లు పోలింగ్‌ రోజుకు ముందే ఈ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అంచనా. సాధారణ ఓట్లతో పోలిస్తే మెయిల్‌ బ్యాలెట్లను లెక్కించడానికి అధిక సమయం అవసరమవుతుంది. ఈ సారి వాటి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పోలింగ్‌ రోజు ఫలితం వెలువడే అవకాశాలకు తెరపడింది.



అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఎవరైనాసరే పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతుంటే, మరికొన్ని రాష్ట్రాలు పరిమితులు విధిస్తున్నాయి. సరైన కారణం లేకపోతే మెయిల్‌ ఇన్‌ విధానాన్ని ఆశ్రయించకూడదని స్పష్టం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ బ్యాలట్‌కు రాష్ట్రాలు పెద్దగా అడ్డుచెప్పకపోయినా.. వాటిని స్వీకరించే గడువు, లెక్కింపును ప్రారంభించే సమయం విషయంలో తేడాలున్నాయి.

సాధారణంగా ఎన్నికల తేదీ నాటికి వచ్చిన పోస్టల్‌ ఓట్లనే లెక్కిస్తారు. తర్వాత వచ్చిన వాటిని పక్కనబెడతారు. అయితే- ఎన్నికల తేదీ తర్వాత వచ్చే ఓట్లను కూడా స్వీకరించాలంటూ ఇటీవల డెమొక్రాట్లు గట్టిగా డిమాండ్‌ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు కూడా వేశారు. ట్రంప్‌కు లబ్ధి చేకూర్చేందుకుగాను తపాలా శాఖ గడువులోగా ఓట్లను లెక్కింపు కేంద్రాలకు చేర్చకపోవచ్చన్నది వారి ప్రధాన ఆందోళన. డెమొక్రాట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన నేపథ్యంలో ఎన్నికల తేదీ తర్వాత వచ్చే బ్యాలెట్లనూ పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. నార్త్‌ కరోలినా ఈ నెల 12 వరకు, ఒహాయో ఈ నెల 13 వరకు బ్యాలెట్లను స్వీకరించనున్నాయి. ఓట్ల విషయంలో తేడాలొస్తే స్థానిక కోర్టులను రెండు పార్టీలు ఆశ్రయించే అవకాశం ఉంది.

హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్ ఎన్నికలు కూడా
అమెరికా ఓటర్లు మంగళవారం కొత్త అధ్యక్షుడి కోసం మాత్రమే కాకుండా ప్రతినిధుల సభల సభ్యులను ఎన్నుకోవటానికి కూడా ఓటు వేస్తున్నారు. నాలుగేండ్లకోసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు (హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌) కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కూడా ఓటర్లు ప్రతినిధుల సభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అమెరికా చట్టసభల్లో అత్యంత కీలకమైన సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు కూడా మంగళవారం ఓటింగ్‌ జరుగుతున్నది. సెనేట్లో నాలుగేండ్లకోసారి మూడోవంతు సీట్లు ఖాళీ అవుతాయి. వాటికి అధ్యక్ష ఎన్నికలతోపాటు ఓటింగ్‌ నిర్వహిస్తారు. వీటితోపాటు 11 రాష్ర్టాల గవర్నర్లను, రాష్ర్టాల చట్టసభల్లో ఖాళీ అయిన 86 స్థానాలకు సభ్యులను ఎన్నుకొనేందుకు కూడా అమెరికన్లు ఓటు వేయనున్నారు.

ఒకవేళ ఎన్నికలు టై అయితే?

ట్రంప్​, బైడెన్​ ఇద్దరికీ 269 చొప్పున ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు వస్తే.. దాన్ని అధిగమించడానికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది అమెరికన్ రాజ్యాంగం. ఎలక్టోరల్​ కాలేజీ ద్వారా విజేతను ఎంపిక చేయడం కుదరకపోతే 2వ అధికరణంలోని సెక్షన్ 1లో మూడో క్లాజ్ ప్రకారం.. అధ్యక్షుడిని కాంగ్రెస్ ​లోని ప్రతినిధుల సభ ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుడిని సెనేట్​ ఎన్నుకుంటుంది. అయితే సెనేట్ ​లో ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఒక్కో సెనేటర్​కు ఒక ఓటు దక్కుతుంది. అధ్యక్ష ఎన్నిక కోసం ప్రతినిధుల సభలో రాష్ట్రానికి ఒకటి చొప్పున మాత్రమే ఓటు ఉంటుంది. ఆ రాష్ట్ర పరిమాణంతో దీనికి సంబంధం లేదు.

ఈ లెక్కన అధ్యక్షుడు గెలవడానికి 26 రాష్ట్రాల మద్దతు అవసరం. ప్రస్తుత సభలో అలాంటి బలం రిపబ్లికన్లకు ఉంది. డెమొక్రాట్లకు 23 రాష్ట్రాల్లో ఆధిపత్యం ఉంది. కానీ ఇది ట్రంప్​కు ఉపయోగపడదు. ఎందుకంటే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్​కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించగానే కొత్త కాంగ్రెస్​ ఫలితాలు కూడా తెలుస్తాయి. అందులో ఎవిరికి మెజారిటీ వస్తుందో చెప్పలేం. అయితే అధ్యక్ష ఎన్నిక సమం అయినట్లయితే కాంగ్రెస్​కు జరుగుతున్న ఎన్నికలు కూడా కీలకమే.



పార్లమెంటరీ ప్రభుత్వం కాదు
అమెరికాలో ప్రజాస్వామ్యమే ఉన్నా మనదేశంలోలాగా పార్లమెంటరీ ప్రభుత్వం కాదు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం నడుస్తున్నది. భారత్‌లో ఓటర్లు నేరుగా ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు ఓట్లు వేయనట్టే అమెరికా ఓటర్లు కూడానేరుగా అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయరు. ఎన్నికల సమయంలో అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ అన్ని రాష్ర్టాల్లో ప్రతినిధులను నియమిస్తుంది. ఓటర్లు ఆ ప్రతినిధులకు ఓట్లు వేస్తారు. వారిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు. ఆ ఎలక్టోరల్‌ కాలేజీ దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.



అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలోని 50 రాష్ర్టాలు, కొలంబియా జిల్లాలో కలిసి మొత్తం 538 ఎలక్టోరల్‌ స్థానాలు ఉన్నాయి. ఈ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో జనాభాను బట్టి మారుతూ ఉంటుంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో మూడే ఉన్నాయి. మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లలో కనీసం 270 ఓట్లు వచ్చిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు అవుతారు.



అగ్రరాజ్యం ఎన్నికల్లో పాపులర్‌ ఓటు విధానం అత్యంత కీలకమైనది. ఒక రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్లన్నీ బదిలీ అవుతాయి. ఉదాహరణకు టెక్సాస్‌లో 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మంగళవారం నాటి ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు చెరిసగం ఎలక్టోరేట్లను గెలుచుకున్నాయి అనుకుందాం. అయితే, మొత్తం ఓట్లలో రిపబ్లికన్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఈ 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ ఖాతాలోకి వెళ్లిపోతాయి. దీనినే పాపులర్‌ ఓట్‌ అంటారు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాటి డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ పాపులర్‌ ఓటు విధానం వల్ల ట్రంప్ ‌కు ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు రావటంతో ఆయన అధ్యక్షుడు అయ్యారు.