Michael Packard : తిమింగలం మింగినా.. ప్రాణాలతో బయటపడ్డాడు

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డ వారిని చావు నోట్లో తల పెట్టి బయటపడ్డారని అంటుంటారు.

Michael Packard : తిమింగలం మింగినా.. ప్రాణాలతో బయటపడ్డాడు

Whale

Michael Packard పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డ వారిని చావు నోట్లో తల పెట్టి బయటపడ్డారని అంటుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తిమింగలం మింగినా కూడా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కేప్​ కాడ్​ సముద్ర తీరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

మసాచుసెట్స్ లోని ప్రావిన్స్​ టౌన్​కు చెందిన చెందిన మైకేల్ ప్యాకార్డ్ (56) సముద్రంలో లోబ్ స్టర్లు (పెద్ద రొయ్యల వంటి జీవులు) వేటాడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం మసాచుసెట్స్ లోని కేప్​ కాడ్​ సముద్ర తీరంలో లోబ్ స్టర్ల వేటకు వెళ్లాడు. తన సహచరుడితో కలిసి బోటులో సముద్రంలో కొంతదూరం వెళ్లి, ఆపై లోబ్ స్టర్ల కోసం సీ డైవింగ్ చేశాడు మైకేల్ ప్యాకార్డ్. అయితే ఎప్పటిలానే సముద్రంలోకి డైవ్​ చేసిన మైకేల్..​ హంప్ బ్యాక్ తిమింగలం నోట్లో చిక్కుకున్నాడు. దీంతో బతుకుపై ఆశలు వదిలేసుకున్న మైకేల్.. కొన్ని సెకెండ్లపాటు తిమింగలం నోట్లోనే బిక్కుబిక్కుమని గడిపాడు. అయితే ఆ తిమింగలం నోట్లో చిక్కిన మైకేల్‌ను మింగేయకుండా బయటకు ఉమ్మేసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు మైఖేల్‌. ఈ ఘటనలో కాళ్లు విరిగి ఆసుపత్రిలో చేరిన మైకేల్​..డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తున్నాడు.

తిమింగలం నుంచి తప్పించుకున్న విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా మైకేలే వెల్లడించాడు. అందరికీ హాయ్, ఈ రోజు నాకు జరిగిన ప్రమాదం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను డైవింగ్ చేసినప్పుడు హంప్‌బ్యాక్ తిమింగలం నన్ను తినడానికి ప్రయత్నించింది. దీంతో 30 నుంచి 40 సెకన్లపాటు నేను తిమింగలం నోట్లోనే చిక్కుకున్నాను. అప్పుడు నాకు చావు తప్పదని ఫిక్స్ అయిపోయాను. అయితే తిమింగలం నీటి ఉపరితలం పైకి లేచి నన్ను ఉమ్మివేసింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డాను. అయితే చాలా గాయాలయ్యాయి. ప్రొవిన్స్‌టౌన్ రెస్యూ స్క్వాడ్ నాకు సహాయం చేసింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మైకేల్ ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపాడు.

అయితే, ఇటువంటి ఘటనలు జరగడం చాలా అరుదు అని ప్రొవిన్స్‌టౌన్‌లోని సెంటర్ ఫర్ కోస్టల్ స్టడీస్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చార్లెస్ తెలిపాడు తిమింగలం చేపలను ఆహారంగా తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.