దొందూ..దొందే : తుస్సుమన్న మిసైల్స్ మీటింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 28, 2019 / 03:42 PM IST
దొందూ..దొందే : తుస్సుమన్న మిసైల్స్ మీటింగ్

ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోని మెట్రోపాల్ హోటల్ వేదికగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) వీరిద్దరూ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం రెండు రోజులు వీరి భేటీ జరగాల్సి ఉంది. అందులో భాగంగా గురువారం ఈ ఇద్దరు నేతలు సమావేశం కావాల్సి ఉంది. అయితే అర్థంతరంగా ఇద్దరు దేశాధినేతలు హోటల్ నుంచి వెళ్లిపోయారు.  

దీనిపై ట్రంప్ మాట్లాడుతూ…ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్ కోరారని, దానికి తాము అంగీకరించలేదని, అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయని తెలిపారు. ఉత్తరకొరియాలోని యాంగ్ బియాన్ అణు కేంద్రాన్ని కూల్చివేసేందుకు కిమ్ సిద్దంగా ఉన్నారని, దానికి బదులుగా తమ దేశంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కిమ్ కోరినట్లు తెలిపారు. అయితే అణ్వాయుధాలు,క్షిపణులను పరీక్షంచబోమన్న హామీకి కిమ్ కట్టుబడి ఉంటారని తాను నమ్ముతున్నానని తెలిపారు. కిమ్ తో మరోసారి భేటీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  అన్నారు. ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మక సమావేశాలు జరిగాయి కానీ అణునిరాయుధీకరణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ తెలిపింది.

సింగపూర్ లో 2018లో ట్రంప్-కిమ్ మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య అణు నిరాయుధీకరణపై ఒప్పందం జరిగినా విధివిధానాలేమీ స్పష్టంగా ఖరారు కాలేదు. మరోసారి ఇద్దరి దేశాధినేతలు బుధవారం(ఫిబ్రవరి-27,2019) వియత్నాం వేదికగా సమావేశమయ్యారు.