భారత్‌కు ట్రంప్ వచ్చేది ఈ తేదీల్లోనే!

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 04:09 AM IST
భారత్‌కు ట్రంప్ వచ్చేది ఈ తేదీల్లోనే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు ప్రధాని @narendramodi! అంటూ వైట్ హౌస్ ట్వీట్ చేసింది.

ట్రంప్ పర్యటన.. అమెరికా, భారత్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా అమెరికిన్లు, భారతీయుల మధ్య సత్సంబంధాలు, బలమైన శాశ్వతమైన బంధాలు కొనసాగేలా చేస్తుందని వైట్ హౌస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.

దౌత్యపరమైన మార్గాల్లో భారత్, అమెరికా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని ఈ ఏడాది జనవరి 16న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ట్రంప్ భారత్ లో పర్యటించనున్నట్టు ఈ నెలలో ఊహాగానాలు వినిపించాయి. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమైన సమయంలో ఆయన్ను భారత్ లో పర్యటించాలని మోడీ ఆహ్వానించారు.

ఈ విషయంలో ఇరుదేశాలు స్వాగతించాయి కూడా. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిన వెంటనే అందిరితో పంచుకుంటామని విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిది రావీశ్ కుమార్ తెలిపారు. గత సెప్టెంబర్ నెలలో హౌస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ కార్యక్రమం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ తో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ.. ట్రంప్.. ఆయన ఫ్యామిలీని భారత్ లో పర్యటించాలని ఆహ్వానించారు.