గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు : భయపెడుతున్న యూఎస్ – ఇరాన్ ఉద్రిక్తత

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 06:58 AM IST
గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు : భయపెడుతున్న యూఎస్ – ఇరాన్ ఉద్రిక్తత

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా ప్రకటించింది.

జనరల్‌ ఖాసీంను అమెరికా చంపేయడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇరాన్‌. సులేమానీ హత్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గల్ఫ్‌లో శాంతి భద్రతలే ప్రధానం కావాలని భారత్ కోరింది. ఈ పరిణామాల క్రమంలో గల్ఫ్‌లో నివాసం ఉంటున్న 10 మిలియన్ల భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి.

అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా భారతీయ అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతను పరిరక్షించడం భారతదేశానికి అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా అంచనా వేస్తున్నారు. 1990-91 జరిగిన గల్ఫ్ వార్‌ గుర్తుకొస్తోంది. అప్పుడు పది వేల మంది భారతీయులను కువైట్, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేశారు. లిబియా, ఇరాక్, యెమెన్‌లో ఉంటున్న ఇండియన్స్‌ను సురక్షితంగా తరలించడంలో సక్సెస్ అయ్యారు అధికారులు. అస్థిరత పరిస్థితులు ఏర్పడడం కారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సవాల్‌గా మారిపోయాయి. 

 

ఆర్థిక ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలోకి వచ్చే 70 బిలియన్ డాలర్ల చెల్లింపుల్లో దాదాపు 40 బిలియన్ డాలర్లు గల్ఫ్ నుంచి వస్తుంటాయి. గల్ఫ్‌లో ఇండియన్ వ్యాపార వేత్తలు ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇవి..దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాయి.

ఇజ్రాయిల్, ఇరాన్‌లతో పాటు సౌదీ అరేబియా, యుఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో భారత్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం దాడులను అమెరికా మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 14-16 తేదీల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో పర్యటించనున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి. 

Read More : కదం తొక్కిన ఆశా వర్కర్లు..గులాబీ చీరలు ధరించి భారీ ర్యాలీ