నల్లజాతీయుడి హత్యతో అట్టుడుకుతున్న అమెరికా, మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన ఆందోళనలు

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 02:50 AM IST
నల్లజాతీయుడి హత్యతో అట్టుడుకుతున్న అమెరికా, మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన ఆందోళనలు

ఆందోళనలు, విధ్వంసాలతో అమెరికా అట్టుడికిపోతోంది. ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతోంది. న్యాయం కోసం నినాదాలు మిన్నంటాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లజాతీయుల పోరాటం కొనసాగుతోంది. కొన్నిరోజుల క్రితం మిన్నపొలిస్ లో ఓ పోలీసు అధికారి చేతిలో దారుణంగా హత్యకు గురైన జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ మొదలైన ఉద్యమం అమెరికా అంతటా విస్తరించింది. ఫ్లాయిడ్ కు న్యాయం జరగాలి, పోలీస్ కు శిక్ష పడాలి అనే నినాదం ఊపందుకుంది.

పోలీసులపై దాడులు:
మిన్నెపొలిస్‌లో శనివారం(మే 30,2020) నాటికి ఆందోళన అదుపు తప్పింది. కర్ఫ్యూ విధించి, నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. విధ్వంసకాండ శనివారం దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. డెట్రాయిట్‌లో పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌, పోలీసులను శిక్షించండి.. జాత్యహంకార హత్యలను ఇక ఆపండి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో వందలమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అట్లాంటాలో నిరసనకారులు పోలీసు కార్లను ధ్వంసం చేశారు. సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. న్యూయార్క్‌లో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

1

ఆందోళనలు అదుపు చేయలేక చేతులెత్తేసిన గవర్నర్:
పరిస్థితిని అదుపు చేసేంత సంఖ్యలో భద్రతా సిబ్బంది తమ దగ్గర లేరని మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ చేతులెత్తేశారు. నిరసనకారులను అరెస్టు చేస్తే పరిస్థితి మరింత విషమించొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మిన్నెపొలిస్‌, సెయింట్‌పాల్‌ నగరాలు తగలబడుతున్నాయి. నగరంలో మిగిలిన బూడిద కొన్ని తరాలు దశాబ్దాల నుంచి భరిస్తున్న నొప్పి, పడుతున్న వేదనకు చిహ్నం. దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నది’ అని అన్నారు. నిరసనలను అదుపు చేసేందుకు అవరసమైతే ఆర్మీని దించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీకి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారట. 

2

నల్లజాతీయుడిని చంపిన పోలీస్ కు విడాకులు ఇచ్చిన భార్య:
ఇదిలా ఉండగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీస్‌ డెరెక్‌ చౌవిన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. కాగా డెరెక్ భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపిన డెరెక్‌తో కలిసి జీవించలేనంటూ విడాకులకు దరఖాస్తు చేశారు.

2

రంగంలోకి సైన్యం:
నల్లజాతీయుల ఆందోళన దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తుండటంతో సైన్యాన్ని రంగంలోకి దించాలని ఫెడరల్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. ఏ క్షణంలో అయినా ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశిలిచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలపాలని నల్లజాతీయుల దివంగత ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌కింగ్‌ చిన్న కూతురు బెర్నైస్‌ కింగ్‌ ఆందోళనకారులకు పిలుపునిచ్చారు.