మళ్లీ మధ్యవర్తిత్వం : భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరిస్తా…ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 12:02 PM IST
మళ్లీ మధ్యవర్తిత్వం : భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరిస్తా…ట్రంప్

భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. లఢఖ్,సిక్కిం సరిహద్దుల్లో ఇదు దేశాల బలగాలు పోటాపోటీగా మోహరించాయి. ఈ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. అయితే ఈ సమయంలో చైనా, భారత్ సరిహద్దు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రెండు దేశాలు కోరితే సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇరుదేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ ట్వీట్ ద్వారా తెలిపారు.

కాగా,గతంలో కశ్మీర్ విషయంలో కూడా ట్రంప్ అనేకసార్లు మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్ భారత అంతర్భాగమని మోడీ సర్కార్ చెప్తున్నప్పటికీ..పదే పదే భారత్-పాక్ మధ్య కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీ అంటూ గతేడాది ట్రంప్ వ్యాఖ్యానించడం,ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించడం జరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు భారత్ తో సరిహద్దు వివాదంపై బుధవారం(మే-27,2020)విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జాహో లిజియాన్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులు నిలకడగా,నియంత్రలోనే ఉన్నట్లు తెలిపారు. చర్చలు,సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు రెండు దేశాలకు సరైన వ్యవస్థ,కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నట్లెు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా రెండు దేశాలు చేసుకోవాలని,ప్రస్తుతం రెండు దేశాలు కరోనాపై పోరాడాలని అన్నారు.

లఢఖ్ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. NAS చీఫ్ అజిత్ దోవల్, త్రివిధ దళాల ప్రధాన అధికారి (CDS) బిపిన్ రావత్‌లో కీలక చర్చలు జరిపారు. విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తో కూడా మోడీ మంతనాలు జరిపారు. త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సమావేశమయ్యారు. 

ఈ నెల 5న తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాకి చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ గొడవలో రెండువైపులా 100 సైనికులు గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు రెండు వైపులా కమాండర్లు మాట్లాడుకోవడం ద్వారా మేటర్ సెటిలైంది. 4 రోజుల తర్వాత ఉత్తర సిక్కింలో నాథులా పాస్ దగ్గర మరోసారి గొడవ జరిగింది. ఆ ఘటనలో రెండువైపులా 10 మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా చైనా తూర్పు లఢక్ దగ్గర వాస్తవాధీన రేఖ వెంట 5000 బలగాల్ని వేర్వేరు లొకేషన్లలో మోహరించింది. పాంగ్యాంగ్ సరస్సు, గల్వాన్ లోయ సమీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇది గమనించిన ఇండియా కూడా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇలా పోటా పోటీగా సైన్యాలను మోహరించడంతో సరిహద్దుల్లో అసలేం జరుగుతోందనని అంతటా ఉత్కంఠ నెలకొంది.

Read: ట్రంప్ కు ట్విట్టర్ వార్నింగ్…అధ్యక్షుడుకి ఆగ్రహం