షాకింగ్.. కరోనా సోకిన ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న మహిళ మృతి.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

షాకింగ్.. కరోనా సోకిన ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న మహిళ మృతి.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

Woman Dies Lungs Infected With SARS-CoV-2: అమెరికాలోని మిచిగాన్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇప్పటివరకు సజీవంగా ఉన్న మనిషి నుంచి మాత్రమే.. మరో మనిషికి కరోనా వ్యాపిస్తుందని అనుకున్నాం. కానీ, చనిపోయిన వ్యక్తి అవయవాల ద్వారా కూడా కరోనా సోకుతుందనే భయంకరమైన నిజం బయటపడింది.

కరోనా సోకిన ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న మహిళ చనిపోయింది. సర్జరీ సమయంలో లంగ్స్ ని టెస్ట్ చేయగా, కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే సర్జరీ చేసిన మూడు రోజుల ఆ మహిళ కరోనా బారిన పడింది. కొన్ని రోజులకు చనిపోయింది. ఆమె మరణానికి కొవిడ్ కారణం అని తేలింది. అవయవ మార్పిడి ద్వారా కరోనా సోకి చనిపోవడం ప్రపంచంలో ఇదే తొలి కేసు అని డాక్టర్లు తెలిపారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో ఈ కేసు వివరాలు పబ్లిష్ చేశారు.

అంతేకాదు, సర్జరీ చేసిన డాక్టర్ కూడా కరోనా బారిన పడ్డాడు. లంగ్స్ లోని మ్యూకస్ కు ఎక్కువసేపు ఎక్స్ పోజ్ కావడంతో డాక్టర్ కరోనా బారిన పడ్డాడు. అయితే స్వల్ప సమయంలోనే ఆ డాక్టర్ కరోనా నుంచి కోలుకున్నాడు.

ఇది చాలా బాధాకరం అని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు. కాగా, అవయవ దానం చేసిన వ్యక్తి నుంచి కరోనా సోకే ప్రమాదం 1శాతం కన్నా తక్కువ అని తేల్చారు. ఈ ఘటనతో డాక్టర్లు అప్రమత్తమయ్యారు. సర్జరీ చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యకరమైన అవయవాలను మాత్రమే సర్జరీకి వినియోగించాలని నిర్ణయించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు మృతురాలి అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. మృతురాలికి స్వాబ్ టెస్ట్ చేశారు. ఎలాంటి కరోనా వైరస్ జాడ కనిపించలేదు. అంతేకాదు బతికున్నప్పుడు కూడా ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించ లేదు. దీంతో డాక్టర్లు మృతురాలి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను మృత్యువుతో పోరాడుతున్న మరో మహిళకు ట్రాన్స్ ప్లాంట్ చేశారు.

సర్జరీ జరిగిన రెండు రోజులకే.. డాక్టర్లకు ఏదో అనుమానం వచ్చింది. సర్జరీ చేయించుకున్న పేషెంట్ ఆరోగ్యం దెబ్బతింది. ఆమె గుండె లయలో తేడాలు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టులో షాకింగ్ విషయం తెలిసింది. కరోనా పాజిటివ్ అని రావడంతో డాక్టర్లు కంగుతిన్నారు.

డాక్టర్లు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. రెమ్ డెసివిర్ మందు ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది. పేషెంట్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న 61 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయని, శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారి మరణించిందని డాక్టర్లు వెల్లడించారు.

ఇలా జరగడం ప్రపంచంలోనే తొలి కేసుగా డాక్టర్లు అభివర్ణించారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలుపుతుందన్నారు. అవయవాల్లో కరోనా వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక టెస్టు మాత్రమే చేస్తే సరిపోదని.. అంతకుమించి టెస్టులు చేయడం మంచిదని చెబుతున్నారు. అయితే, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకునే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. అన్ని సమయాల్లో ఇలానే జరుగుతుందని చెప్పలేము అన్నారు.