మాకు కరోనా వ్యాక్సిన్లు ఇస్తే.. మీకు ఆయిల్ ఇస్తాం : వెనిజులా అధ్యక్షుడు ఎక్సేంజ్ ఆఫర్

మాకు కరోనా వ్యాక్సిన్లు ఇస్తే.. మీకు ఆయిల్ ఇస్తాం : వెనిజులా అధ్యక్షుడు ఎక్సేంజ్ ఆఫర్

Venezuela President Coronavirus Vaccines With Oil (1)

Venezuela President corona virus vaccines with oil : కరోనా వైరస్. కంటికి కనిపించ కుండా ప్రపంచాల్ని హడలెత్తించేస్తోంది. ఈ మహమ్మారిని ఖతం చేయటానికి భారత్ తో సహా పలు దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టాయి. ప్రజలకు వ్యాక్సిన్లను వేస్తున్నారు. కానీ చిన్న దేశాల పరిస్థితి మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి రాక కరోనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో వెనిజులా దేశపు అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆయన చేసిన ప్రకటన ఏమిటంటే..‘‘కరోనా వైరస్ తో అల్లాడుతున్న మా దేశానికి వ్యాక్సిన్లు ఇస్తే మీకు మేం ఆయిల్ అంటే చమురు ఇస్తాం’’అని ప్రకటించారు. ఈయన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. వెనిజులా అధ్యక్షుడు తెరపైకి తీసుకొచ్చిన ఈ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

నికోలస్ మదురో ప్రకటన పూర్తి సారాంశం..”మా వెనిజులా వద్ద భారీగా చమురు ఉంది. దాన్ని కొనేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ..మా చమురు ఉత్పత్తిలో కొంత భాగాన్ని కరోనా వ్యాక్సిన్ ను పొందేందుకు వినియోగించాలనుకుంటున్నాం అని తెలిపారు. మా దేశానికి వ్యాక్సిన సరఫరా చేసిన దేశానికి వాటికి బదులుగా మేం చమురు ఇస్తాం ” అని మదురో ప్రకటించారు. వెనిజులాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలను కాపాడుకోవటానికి అధ్యక్షుడు నికోలస్ మదురో ఈ ప్రకటన చేశారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో భారత్‌ వంటి దేశాలు అక్కడి నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితిలు నెలకొన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలకు ఈ దేశ క్రూడాయిల్ ఎగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. వెనిజువెలాకు మిత్ర దేశాలైన రష్యా, చైనాల నుంచి వ్యాక్సిన్లు వచ్యాయి. రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ టీకాతో పాటు చైనాలో అభివృద్ధి చేసిన మరో టీకా వినియోగానికి మాత్రమే అనుమతులు లభించాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కోవాక్స్ మెకానిజం ద్వారా కరోనా వ్యాక్సిన్లను పేద దేశాలకు అందజేస్తోందని, ఈ క్రమంలో తాము ఏ దేశమైనా తమకు వ్యాక్సిన్లు ఇస్తే దానికి బదులుగా ఆయిల్ ను ఇస్తామంటున్నామని వెనెజులా అధ్యక్షుడు మదురో ప్రతిపాదన తెచ్చారు. ఆంక్షల కారణంగా తమ దేశం నిధుల కష్టాలను ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.

మరోవైపు వెనిజులా ప్రభుత్వం వైద్యారోగ్య సిబ్బందికి టీకాలివ్వడం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ..ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 1,50,000 మంది కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. వీరిలో 1,565 మంది ప్రాణాలు కోల్పోయారు.

కానీ ఈ లెక్కలు సరైనవి కాదనీ కేసులు ఇంకా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు వాదిస్తున్నాయి. పైగా ఇటీవలి కాలంలో కేసులు మరోసారి భారీ స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవటానికి దేశాధ్యక్షుడు నికోలసి మదురో ఈ ప్రకటన చేశారు.