Antarctic Bill : అంటార్కిటికాపై పట్టుకోసం ప్రపంచ దేశాల పోటీ..మంచుఖండంపై ఎందుకింత ఆసక్తి..?

ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?

Antarctic Bill : అంటార్కిటికాపై పట్టుకోసం ప్రపంచ దేశాల పోటీ..మంచుఖండంపై ఎందుకింత ఆసక్తి..?

Indian Antarctic Bill..2022 (1)

india Antarctic Bill-2022 : అంటార్కిటికా దక్షిణ ధృవంపై పెత్తనం చలాయించేందుకు చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ దక్షిణ ధ్రువం ఎవరికి చెందుతుంది ? తమదంటే తమదంటూ చాలా దేశాలు ఎందుకు వాదిస్తున్నాయ్ ? ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై… ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ?

భూమిపై అత్యంత చల్లని… అత్యధిక వేగంతో గాలులు వీచే… ద్రవరూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. దీంతో ఈ ప్రాంతానికి చెందిన సొంత జనాలంటూ ఎవరూ ఉండరు. ఐతే ఇది ప్రపంచంలో ఇది నాలుగో అతిపెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే. ఎక్కువ మంది సొంతం చేసుకోవాలనుకునే ఖండం కూడా ఇదే. 14 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో… కొంత భాగం తమదంటే తమదని ఏడు దేశాలు పోటీపడుతున్నాయ్. వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్‌లాంటి దేశాలు ఉన్నాయ్. మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్‌లాంటి సుదూర ఐరోపా దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు అధికారం ఉందని చెప్తున్నాయ్.

Also read : Antarctic Bill-2022 : అంటార్కిటికా మీద కన్నేసిన చైనా‌..మంచుఖండాన్ని కాపాడటానికి భారత్‌ కీలక నిర్ణయం

అధికారం తమదంటే తమది అని దేశాల ప్రకటనలు ఎలా ఉన్నా.. ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా 35దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయ్. దక్షిణ ధ్రువంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికీ చెందదని చాలా దేశాలు చెప్తున్నాయ్. డిసెంబరు 1, 1959లో ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన ఏడు దేశాలతోపాటు మరో 5 దేశాల మధ్య అంటార్కిటిక్‌ ట్రీటీ పేరుతో ఒప్పందం కుదిరింది. ప్రకటనలు పక్కనపెట్టి.. అంతర్జాతీయ పరిశోధనల కోసం దీన్ని యూజ్ చేస్తామని ఈ ఒప్పందంలో తీర్మానించారు. ఇక్కడ అణుపరీక్షల నిర్వహణ నిషేధించారు. సైనిక పరమైన చర్యలపైనా ఆంక్షలు విధించారు. ఈ ఒప్పందంపై 42దేశాలు సంతకాలు చేశాయ్. వీటిలో 29దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధన చేస్తున్నాయ్.

మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై… ప్రపంచ దేశాలు ఆసక్తి చూపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయ్. ఈ మంచు కింద ఎంతో విలువైన సహజ సంపదలు ఉన్నాయ్. మెరైన్‌ సైంటిస్టులు ఎక్కువగా ఇక్కడ దృష్టి సారించడానికి అదే కారణం. అంటార్కిటికా ట్రీటీ ప్రకారం.. ఇక్కడ చమురు, ఖనిజాల వెలికితీత నిషేధం. ఐతే శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు. అంటార్కిటికా కింద దాదాపు 2లక్షల మిలియన్ బ్యారెళ్లు.. అంటే కువైట్‌, అబుదాబి దగ్గర ఉన్నదాని కంటే ఎక్కువ చమురు ఉందని పరిశోధకుల అంచనా. ఐతే వీటిని అన్వేషించడం ఇప్పుడు కుదరదు. వీటిని వెలికి తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ ప్రయత్నాలు అంటార్కిటికా పర్యావణానికి హాని చేస్తాయి.

చమురు, సహజ వాయువుతో పాటు… బొగ్గు, సీసం, ఉక్కు, క్రోమియం, కాపర్, బంగారం, నికెల్, ప్లాటినం, యురేనియం, సిల్వర్ నిక్షేపాలు అంటార్కిటికాలో పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయ్. అంటార్కిటిక్ సముద్రం కూడా భారీ మత్స్య సంపదకు నిలయం. మంచు ఫలకాలు, సముద్రం కింద ఖనిజ సంపదలు మాత్రమే కాదు.. అంతకంటే విలువైన మంచి నీటికి ఈ ఖండం నిలయం. అంటార్కిటాపై గడ్డకట్టిన మంచు రూపంలో.. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచి నీరు ఉంది. భవిష్యత్‌లో ఇది బంగారం కంటే విలువైన వనరుగా మారుతుందనడంలో సందేహం లేదు. భూమిపై నుండే మంచి నీటిలో 70శాతం అంటార్కిటికాలోనే ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయ్.

క్లీన్‌గా ఉండే ఇక్కడి ఆకాశంలో.. ఎలాంటి రేడియో సంకేతాల అవరోధాలు ఉండవు. అంతరిక్ష పరిశోధనలకు, ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ఇది చాలా మంచి ప్రాంతం. ఇక్కడ చైనా ఏర్పాటుచేసిన తైషన్‌ స్థావరాన్ని నిఘా కోసం ఉపయోగించుకుంటున్నారని ఆస్ట్రేలియా గతంలో ఆరోపించింది. ఇన్ని సహజ వనరులకు నిలయం కాబట్టే.. ఈ ప్రాంతం తమదంటే తమదని చాలా దేశాలు ప్రకటిస్తున్నాయ్. చైనా అంటార్కిటికాను కూడా ఆక్రమించుకునే పని మొదలుపెట్టింది..