నిజం తేలుతుందా?: కరోనా మూలాల దర్యాప్తు కోసం చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ

నిజం తేలుతుందా?: కరోనా మూలాల దర్యాప్తు కోసం చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చెయ్యగా.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఏడాది దాటినా ఇంకా కూడా మహమ్మారి నీడ ప్రపంచంలో వ్యాపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అసలు కరోనా పుట్టుకకు కారణమైన చైనాలోని వూహన్‌లో కరోనా వైరస్ మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తు ప్రారంభించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) బృందం చైనాలో పర్యటిస్తోంది.

డబ్ల్యూహెచ్ఓ, చైనాల మధ్య నెలల తరబడి కొనసాగిన చర్చల తర్వాత దర్యాప్తు మొదలైంది. డబ్ల్యూహెచ్ఓ బృందంలో 10 నిపుణులైన శాస్త్రవేత్తలు ఉండగా.. వూహాన్ నగరంలో తొలుత ఈ మహమ్మారి ప్రారంభం అయినట్లుగా.. సీఫుడ్ మార్కెట్, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలకు సంబంధించిన వారిని ఈ శాస్త్రవేత్తలు పరిశీలించబోతున్నారు. కోవిడ్-19ను సెంట్రల్ చైనాలోని వూహాన్ నగరంలో 2019 చివర్లో గుర్తించగా.. ఈ నగరంలో ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉంది.

అయితే, అమెరికాతో సహా అనేక అగ్రదేశాలు కరోనా విషయంలో చైనాను నిందిస్తూ ఉండగా.. ఈ బృందం తమ పరిశోధన మొదలుపెట్టటానికిమ చైనాకు చేరుకుంది. రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండి.. తర్వాత చైనా అధికారులు అందించే నమూనాలు, ఆధారాలను బట్టి దర్యాప్తు ప్రారంభిస్తోంది. ఏం జరిగిందో మేం పూర్తిగా అర్థం చేసుకోవటానికి సుదీర్ఘ సమయం పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

మహమ్మారి జంతువుల నుంచి మనుషులకు సోకిందనే అంశం మీద ముఖ్యంగా దర్యాప్తు చేయనున్నారు శాస్త్రవేత్తలు. మొదట్లో దర్యాప్తుకు చైనా ఒప్పుకోకపోవడంతో దర్యాప్తు విషయంలో అనుమానాలు వ్యక్తం అవ్వగా.. తర్వాత చర్చల అనంతరం దర్యాప్తుకు చైనా అంగీకరించింది. మొదట్లో కేసులు వూహాన్‌లో కనిపించినప్పటికీ ఈ వైరస్ ఇక్కడే మొదలై ఉండకపోవచ్చు అని చైనా అనేక నెలలుగా చెబుతూ వస్తుంది. దీంతో శాస్త్రవేత్తల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.