WHO: కరోనాతో మరణించే రిస్క్ తగ్గించే మెడిసిన్ ఇవే.. WHO సిఫార్సులు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ విషయంలో ప్రత్యేక సూచనలు, అధ్యయనాలను విడుదల చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో 11వేల మంది రోగులపై ప్రభావం చూపిన మెడిసిన్ డేటా పరిశీలించింది WHO

WHO: కరోనాతో మరణించే రిస్క్ తగ్గించే మెడిసిన్ ఇవే.. WHO సిఫార్సులు!

Who

Roche, Sanofi drugs: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ విషయంలో ప్రత్యేక సూచనలు, అధ్యయనాలను విడుదల చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో 11వేల మంది రోగులపై ప్రభావం చూపిన మెడిసిన్ డేటాను పరిశీలించిన తర్వాత రోచె (ROG.S) కంపెనీకి చెందిన యాక్టెమ్రా, సనోఫీ (SASY.PA) కంపెనీ కెవ్‌జరా మందులను మరణప్రమాదం(డెత్ రిస్క్) తగ్గించేందుకు కరోనా రోగులకు ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది.

కరోనా తీవ్రంగా ఉండి మరణించే ప్రమాదం ఉంది అనుకునే రోగులకు ఈ ఇంటర్‌లూకిన్-6 విరోధులు(Interleukin-6 Antagonists) అని పిలవబడే చికిత్సను అందించాలని సూచించింది WHO. ఈ మందులు వెంటిలేషన్ అవసరాన్ని, డెత్ రిస్క్‌ని తగ్గిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.

డబ్ల్యూహెచ్‌ఓ విశ్లేషణ ప్రకారం, కరోనా సోకి చనిపోయే ప్రమాదం ఉన్న వ్యక్తులు సోకిన 28 రోజుల్లోపు డెక్సామెథాసోన్ లేదా కార్టికోస్టెరాయిడ్స్‌తో ఆర్థరైటిస్ మెడిసిన్‌లో ఒకదాన్ని పొందితే 25% చనిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోగలరని చెబుతున్నారు. ప్రతి 100 మంది రోగులకు నలుగురు కచ్చితంగా కోలుకున్నట్లుగా డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

అంతేకాకుండా, వెంటిలేషన్ మీదకు వెళ్ళే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వంద మందిలో ఏడుగురు వెంటిలేషన్ అవసరం లేకుండా ఈ మెడిసిన్ వాడి బయటపడినట్లు కూడా డబ్ల్యూహెచ్‌ఓ చెబుతుంది. ఈమేరకు క్లినికల్ కేర్ ట్రీట్మెంట్ మార్గదర్శకాలను అప్‌డేట్ చేసినట్లుగా WHO హెల్త్ ఎమర్జెన్సీ అధికారి జానెట్ డియాజ్ వెల్లడించారు.

ఈ విశ్లేషణలో 10,930 మంది రోగులు పాల్గొనగా.. వారిలో 6,449 మందికి ఈ మెడిసిన్‌లలో ఒకటి ఇచ్చారు. 4,481 మందికి ఈ మందులను ఇవ్వకుండా గమనించారు. కింగ్స్ కాలేజ్ లండన్, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ కాలేజ్ లండన్ మరియు గైస్ మరియు సెయింట్ థామస్ నేతృత్వంలో NHS ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యయనం జరిపింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించబడింది.

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతవారం COVID-19 కోసం యాక్టెమ్రాకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. మహమ్మారి తీవ్రతరం అయిన సంధర్భంలో దాని ఆఫ్-లేబుల్ వాడకం 2020లో మూడవ వంతు పెరిగింది. అదేవిధంగా గత ఏడాది కెవ్‌జరా అమ్మకాలు 30% పెరిగాయని సనోఫీ వెల్లడించింది.

అయితే, రోగులపై ఈ మెడిసిన్ వాడినప్పుడు కొన్ని లోపాలు కనిపించాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులను వాడాలంటే కచ్చితంగా డాక్టర్ల సూచనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు.