ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన ఆసుపత్రికి WHO బృందం

ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన ఆసుపత్రికి WHO బృందం

WHO team visits china hospital: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ పుట్టింది? అసలు వైరస్ ఎలా వచ్చింది? చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఏం జరిగింది? ఈ మిస్టరీని చేధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం రంగంలోకి దిగింది. వర్క్ ని స్టార్ట్ చేసింది. రెండు వారాల క్వారంటైన్ తర్వాత డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం చైనాలో కరోనా వైరస్ పుట్టుక మూలాలపై దర్యాప్తు ప్రారంభించింది. అందులో భాగంగా అక్కడ మొదటి కరోనా కేసు నమోదైన వుహాన్ లోని జినియాటిన్ హాస్పిటల్ కు వెళ్లింది. 2019 డిసెంబర్ 27న ఆ ఆస్పత్రిలోనే ‘గుర్తు తెలియని న్యుమోనియా’గా కేసును రికార్డ్ చేశారు. కరోనా పేషంట్ల నుంచి డాక్టర్లు నమూనాలు సేకరించారు. హాస్పిటల్ కు వెళ్లిన నిపుణుల బృందం అక్కడి డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అక్కడికి సమీపంలోని హోటల్ లోనే ఇన్నాళ్లూ అధికారులు బస చేశారు. ఇన్ని రోజులు చైనా అధికారులతో వీడియో సమావేశాల ద్వారా కరోనా వ్యాప్తిపై ఆరా తీశారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత వారిని హోటల్ కు పిలిపించుకుని సమావేశమయ్యారు.

‘‘మొదటి ముఖాముఖి సమావేశం. సవరణ: ఆంక్షల నేపథ్యంలో ఫేస్ మాస్క్ టు ఫేస్ మాస్క్ మీటింగ్’’. చైనా టీమ్ లీడర్ ప్రొఫెసర్ లియాంగ్ వనియన్ తో క్షేత్ర సందర్శనలపై చర్చించాము. 14 రోజుల జూమ్ మీటింగ్స్ తర్వాత ఇప్పుడు కలవడం సంతోషంగా ఉంది” అంటూ డచ్ వైరాలజిస్ట్ మేరియన్ కూప్ మన్స్ ట్వీట్ చేశారు. చైనాలో పర్యటిస్తున్న నిపుణుల బృందం.. కరోనా వైరస్ వెలుగుచూసిన సీ ఫుడ్ మార్కెట్లను సందర్శించనుంది. అలాగే వుహాన్ లోని వివాదాస్పత వైరాలజీ కేంద్రానికి కూడా వెళ్లనుంది. ఈ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.