అసలు కరోనా వైరస్ ఎందుకు మారణ హోమం సృష్టిస్తోంది?

  • Published By: vamsi ,Published On : March 20, 2020 / 10:58 PM IST
అసలు కరోనా వైరస్ ఎందుకు మారణ హోమం సృష్టిస్తోంది?

కరోనా దెబ్బకు గతంలో ఎప్పుడూ చూడనంతగా.. అనేక దేశాల్లో ఎవ్వరూ బయట తిరగక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. మనదేశంలో అయితే ఇంకా అటువంటి పరిస్థితి కనిపించట్లేదు కానీ, ఈ ప్రమాదకరమైన వైరస్ దెబ్బకు వణికిపోక తప్పట్లేదు. ప్రపంచంలోకెల్లా మంచి వైద్యం, పరిశోధనలు, యంత్రాంగాన్ని పరుగులెత్తించే వ్యవస్థలు ఉన్న చైనానే ఈ వైరస్ దెబ్బకు అల్లాగిపోతుంది. ఇటలీ సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.. చెప్పుకోవడానికి ఈ వైరస్ పుట్టింది చైనాలోనే అయినా.. ప్రమాదం మాత్రం ఇటలీకే ఎక్కువ జరిగింది. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ నష్టం ఆ దేశానికే జరిగింది. 

చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువ. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌‌లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి ఇది వచ్చింది.

కరోనావైరస్ అనే పేరుగల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్-19 (Covid-19). Coronavirus లోని Co vi లకు డిసీస్ (disease) లోని d ని చేర్చి Covid అని బయటపడిన సంవత్సరం 2019లో 19ని చేర్చి కోవిడ్-19 అనే పేరు పెట్టారు. కరోనావైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు 1 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చు. 

ప్రతి వెయ్యి కరోనావైరస్ కేసుల్లో ఐదు నుంచి 40 కేసుల్లో రోగి మరణించే ఆస్కారం ఉంది. వెయ్యి మందిలో తొమ్మిది మంది అంటే దాదాపు ఒక శాతం మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంది. సీజనల్ ఫ్లూ, మీజిల్స్, ఎబోలా, హెచ్ఐవీ, చికెన్ గున్యా వంటి వైరసులతో సంభవించే మరణాలతో పోలిస్తే కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య తక్కువే. 

అయితే వ్యాప్తి మాత్రం చాలా త్వరగా సాగిపోతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తనతో కాసేపు మాట్లాడినా ఎదుటివ్యక్తికి ఆ వైరస్ సోకుంతుంది. అందుకే ఈ వైరస్ సక్సెస్ అయ్యింది. అప్పట్లో ప్రపంచాన్ని వణికించిన ఎబోలా, సార్స్ వంటి వాటిని ఎదుర్కొన్నట్లే దీనిని కూడా మానవాళి కచ్చితంగా ఎదుర్కొంటుంది. అయితే అందుకు కాస్త టైమ్ పట్టడంతో ఈలోపే వైరస్ విస్తరించి విజయం పొందింది. అయితే మనిషి దీంతో పోరాటం చేస్తాడు. చెయ్యక తప్పదు కూడా.